టిడిపి అధినేత చంద్రబాబును అరెస్టు చేయటానికి ముందు పెద్ద హైడ్రామా చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక చంద్రబాబు బస చేస్తున్న ప్రదేశానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. అనంతపురం నుంచి పోలీసు బృందాలను నంద్యాలకు రప్పించారు. మొత్తం ఆరు బస్సుల్లో బలగాలు ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నాయి. డిఐజి రఘురామి రెడ్డి- జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులను మోహరించారు.
ఎక్కడెక్కడ భారీ కేడ్లు, చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో టిడిపి శ్రేణులు ఆర్కే ఫంక్షన్ హాల్ వద్దకు భారీగా తరలి వచ్చాయి. శనివారం ఉదయం ఐదు గంటల తర్వాత చంద్రబాబు బస్ చేస్తున్న వాహనం వద్దకు పోలీసులు భారీగా తరలివచ్చారు. వాహనం చుట్టూ ఉన్న టిడిపి నేతలను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో కాలువ శ్రీనివాసులు – భూమా బ్రహ్మానందరెడ్డి – భూమా అఖిలప్రియ – జగత్ విఖ్యాత్ రెడ్డి – ఏవీ సుబ్బారెడ్డి – బీసీ జనార్దన్ రెడ్డి స్థానిక టిడిపి నేతలు ఉన్నారు.
బస చేసిన బస్సు నుంచి చంద్రబాబు కిందికి రావడంతో పోలీసుల ఆయనతో మాట్లాడి అదుపులోకి తీసుకున్నారు. కామన్ సిటిజెన్‌కు కూడా ఎందుకు అరెస్టు చేస్తున్నారో తెలుసుకునే హక్కు ఉంటుంది. నేనేం తప్పు చేశానో చెప్పకుండా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగున్నరేళ్లుగా ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నాను.. అందువల్లే తనను జగన్ సర్కార్ కుట్ర పన్ని ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా కుట్ర పన్ని అరెస్టు చేసిందని చంద్రబాబు ఆరోపించారు.