తగ్గేదేలా అంటున్న సూర్య.. ఏ విషయంలో అంటే..!

బాహుబలి సినిమా తర్వాత ఒక కథను రెండు భాగాలుగా చెప్పడం మొదలైంది. ఆ తర్వాత బాహుబలి ఫార్మాట్లో కూడా పుష్ప 2వస్తోంది. ఇప్పటికే కార్తికేయ రెండవ భాగం థియేటర్లలో విడుదలై హల్ చల్ చేస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ కూడా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఇప్పుడు తమిళ స్టార్ హీరో సూర్య కూడా రెండు భాగాలతో సినిమా చేస్తున్నాడు.

మాములుగా చారిత్రక కథాంశం కానీ, థ్రిల్లర్ సబ్జెక్ట్ కానీ రెండు భాగాలుగా చేస్తుంటారు. అయితే సూర్య తాజాగా చేస్తున్న సినిమా పక్కా యాక్షన్ ఫిల్మ్ అని తెలుస్తోంది. తమిళంలో ఊర మాస్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.శివ తమిళంలో అజిత్ హీరోగా వీరమ్, వేదాళం, విశ్వాసం, వివేగం వంటి సినిమాలు వరుసగా చేశాడు. ఇటీవల రజనీకాంత్ తో పెద్దన్న అనే సినిమా తీయగా అది డిజాస్టర్ గా మిగిలింది.

తాజాగా శివ సూర్యతో సినిమా మొదలు పెట్టాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైనట్టు సూర్య ట్వీట్ చేశాడు. ఇందులో సూర్య సరసన బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తోంది. యు.వి.క్రియేషన్స్ స్టూడియోగ్రీన్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సూర్య ఈ సినిమాతో పాటు జల్లికట్టు నేపథ్యంలో వాడివాసాల్ అనే సినిమా కూడా చేస్తున్నాడు.

Tags: director siva, hero surya, kollywood news