భూమా అఖిల‌ప్రియ సీటుకు ఎస‌రు పెడుతోన్న బొండా ఉమా… ఇదెక్క‌డి లెక్క‌…!

విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే టీడీపీ పోలీట్‌ బ్యూరో సభ్యులు బొండా ఉమా.. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సీటుకు ఎర్త్‌ పెట్టడం ఏంటి అనుకుంటున్నారా ? ఇక్కడే ఉంది అసలు లెక్క. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గం టిడిపి టికెట్ పోరు తారాస్థాయికి చేరుకుంది. ఈ రెండు టికెట్ల విషయంలో భూమా నాగిరెడ్డి కుటుంబంలోనే పెద్ద చిచ్చు రేగుతోంది. ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గ టికెట్ విషయంలో భూమా కుటుంబంలో చెలరేగిన మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.

ఏది ఏమైనా భూమా కుటుంబానికి ఈసారి ఒక టికెట్ మాత్రమే ఇవ్వాలని సీనియర్లు కోరుతున్నారు. అది కూడా నంద్యాలతో సరిపెట్టాలన్న డిమాండ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆళ్లగడ్డ టిక్కెట్లు మాత్రం ఏవీ సుబ్బారెడ్డికి ఇవ్వాలన్న చర్చ సాగుతోంది. దీనికి ఆయన వియ్యంకుడు విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు కూడా మద్దతు ఇస్తున్నారట. ఆళ్లగడ్డలో ఏవిని గెలిపించేందుకు అవసరమైన సహాయ సహకారాలు.. బాధ్యతలను తాను కూడా తీసుకుంటానని బొండా చంద్రబాబుతో చర్చించినట్టు తెలుస్తోంది.

గత ఎన్నికలలో ఆళ్లగడ్డ నుంచి భూమ అఖిలప్రియ పోటీ చేశారు. ఆమె ఘోరంగా ఓడిపోయారు. వచ్చే ఎన్నికలలోను ఆమె తనకే టికెట్ కావాలని పట్టుబడుతున్నారు. అయితే ఏవి సుబ్బారెడ్డికి అఖిలప్రియకు మధ్య పచ్చగడ్డి వేస్తే భ‌గ్గు మంటుంది. ఇక్కడ నుంచి తానే పోటీకి దిగుతానంటూ తరచుగా నియోజకవర్గ టిడిపి నాయకులతో సుబ్బారెడ్డి వరుస స‌భ‌లు నిర్వహిస్తున్నారు.

ఇటీవల అఖిలప్రియ నిర్వహించిన కార్యక్రమానికి పార్టీలో కొందరు కీలక నేతలు వెళ్లకుండా ఆయన చక్రం తిప్పారు. ఈ క్రమంలోనే తన అంతర్గత సమావేశాలకు బొండా ఉమాని కూడా ఆహ్వానిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో టిడిపి నుంచి ఆళ్లగడ్డలో తానే పోటీ చేస్తానని సుబ్బారెడ్డి చెప్పేస్తున్నారు. ఏది ఏమైనా భూమ అఖిలప్రియకు ఈసారి టిక్కెట్ రావటం అంతా ఈజీ కాదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.