విశాఖ ఎంపీ బ‌రిలో నంద‌మూరి వార‌సుడు… !

తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు పాతికేళ్ళ వయసు ఉన్న చాలా మంది యువకులు రాజకీయాల్లోకి వచ్చారు. ఆ ఉడకు రక్తం ఎన్టీఆర్‌కు అలా బాగా కనెక్ట్ అయిపోయింది. ఆ తరం వాళ్లంతా తెలుగుదేశం పార్టీకి వీరాభిమానులుగా ఉంటూ వచ్చారు. ఇక తాజాగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు గత ఏడాది మే 28 నుంచి మొదలై ఈ ఏడాది మే 28న ముగిసాయి. అయితే విశాఖలో మాత్రం ఎలాంటి కార్యక్రమం జరగలేదు.

దీంతో స్మార్ట్ సిటీలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించడంతోపాటు దీనికి ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణను ముఖ్యఅతిథిగా పిలిచారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీలో 1983 నుంచి ఉన్న నాయకులు కూడా కనిపించడం విశేషం. ఈ క్రమంలోనే మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, అప్పల నరసింహారాజు వంటి వారు ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి తలుచుకున్నారు.

ఇదిలా ఉంటే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ రావటం విశేషం. ఈ కార్యక్రమం పెట్టడం వెనక ఉద్దేశం ఏంటి ? అన్నది ఇప్పుడు విశాఖ రాజకీయాల్లో తర్జనభజనగా జరుగుతోంది. విశాఖ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ‌ల ప్రకారం వచ్చే ఎన్నికలలో విశాఖ లోక్సభ సీట్లు నుంచి ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ పోటీకి దిగుతారన్న గుసగుసలు అయితే బయలుదేరాయి.

ప్రస్తుతం ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ రాజకీయాలలో ఉన్నారు. ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఇప్పుడు రామకృష్ణ కూడా రాజకీయాల మీద ఆసక్తితో ఉన్నారని అంటున్నారు. ఒకవేళ రామకృష్ణ విశాఖ లోక్సభ బరిలో ఉండాలని ఆసక్తితో ఉంటే.. బాలయ్య రెండో అల్లుడు భరత్‌ను భీమిలి నుంచి అసెంబ్లీ బ‌రిలో దింపుతారని అంటున్నారు.