ఉంగుటూరులో ‘ గ‌న్ని ‘ గెలుపున‌కు తిరుగులేదా… వైసీపీ స‌ర్వే ఏం చెప్పింది…!

ఏపీలో వచ్చే ఎన్నికలకు అప్పుడే సమరశంఖాలు పూరిస్తున్నారు. ప్రధాన పార్టీలు ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉన్నా మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరుగుతున్నాయి అన్నట్టుగా అస్త్ర శాస్త్రాలతో రెడీ అవుతున్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహులు సైతం ప్రతిరోజూ ప్రజల్లోనే ఉంటున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ప్రజల మూడ్ ఎలా ? ఉండబోతోంది అన్నదానిపై పలు జాతీయ మీడియా సంస్థలతో పాటు కాస్తో కూస్తో పేరున్న సంస్థలు కూడా అప్పుడే సర్వేలు చేస్తున్నాయి. ఇక యూట్యూబ్ ఛానల్స్ ఆయా నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో చేస్తున్న సర్వేలకు అయితే లెక్కేలేదు.

తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు, వైసిపికి అనుకూలంగా ఉండే ఆత్మసాక్షి చేపట్టిన సర్వేలో ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని తేలడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది. ముఖ్యంగా ఏపీలో సీఎం పీఠాన్ని నిర్ణయించే గోదావరి జిల్లాల్లో ప్రజల నాడిపై ఆత్మసాక్షి సర్వేలో అనూహ్య ఫలితాలు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో ఖ‌చ్చితంగా ఉభయగోదావరి జిల్లాల పరిధిలో జనసేన ప్రభావం ఉంటుందని ఆత్మసాక్షి స్పష్టం చేసింది.

గత ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు సీటుతో మాత్రమే జనసేన సరిపెట్టుకుంది. అయితే ఈసారి రాజోలుతో పాటు పశ్చిమగోదావరిలో భీమవరం – నరసాపురం నియోజకవర్గంలో జనసేన పాగా వేస్తుందని సర్వే స్పష్టం చేసింది. అలాగే ఉమ్మడి జిల్లాలోని తాడేపల్లిగూడెం – తణుకు నియోజకవర్గాల్లో కూడా జనసేన బలంగా ఉందని.. కాస్త కష్టపడితే ఈ రెండు సీట్లలోను జనసేన విజయం సాధించే అవకాశాలు ఉన్నట్టు కూడా ఈ సర్వే స్పష్టం చేసింది.

ఉంగుటూరులో చెక్కు చెద‌ర‌ని గ‌న్ని ప‌ర్స‌న‌ల్ ఇమేజ్ :
విచిత్రం ఏంటంటే సామాజిక స‌మీక‌ర‌ణ‌లు అంత‌గా క‌లిసి రాక‌పోయినా ఉంగుటూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పర్సనల్ ఇమేజ్ గత 20 ఏళ్లలో ఏమాత్రం చెక్కుచెదరలేదని మరోసారి ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేసింది. గత మూడు ఎన్నికల్లో చూస్తే ఓ ప్ర‌ధాన‌ సామాజిక వర్గం ఓటర్లు మెజార్టీగా గన్ని వైపే మొగ్గారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ బలంగా ఉన్నప్పుడు ఇక్కడ తెలుగుదేశం కేవలం 4500 ఓట్లతో ఓడిపోయింది. 2014 ఎన్నికల్లో గన్ని విజయం సాధించిగా గత ఎన్నికల్లో మాత్రం వైసిపి ప్రభంజనంలో ఇక్కడ పార్టీ ఓడిపోయింది.

గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల కంటే గన్ని నిత్యం ప్రజల్లోనే ఉంటూ వస్తున్నారు. దీనికి తోడు ఆయన ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండడంతో పార్లమెంటు పరిధిలో ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ నాయకులతో మమేకమవుతున్నారు. ఇవన్నీ ఆయన పర్సనల్ ఇమేజ్ చెక్కుచెదరకుండా చేశాయని చెప్పాలి. అందుకే తాజాగా ఆత్మసాక్షి సర్వేలో నరసాపురం, భీమవరంతో పాటు తాడేపల్లిగూడెం, తణుకు లాంటి నియోజకవర్గాల్లో జనసేన బలంగా ఉంటుందని.. ఆ పార్టీ ప్రభావం తెలుగుదేశం పార్టీపై ఉందని స్పష్టమైనా ఉంగుటూరులో మాత్రం టిడిపి నుంచి గన్ని వీరాంజనేయులు మరోసారి విజయం సాధిస్తారని తేల్చి చెప్పింది.

2002 నుంచి నియోజకవర్గ రాజకీయాల్లో ప్రత్యక్షంగా.. పరోక్షంగా చాలా యాక్టివ్‌గా ఉన్న గన్నికి కులాలు, మతాలు.. వర్గాలతో సంబంధం లేకుండా ప్రజల్లో మంచి పట్టు ఉంది. అందుకే ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయిన మూడేళ్లకే మరోసారి నియోజకవర్గ ప్రజలు ఆయన కోరుకుంటున్నారని వైసిపి అనుకూల సర్వే స్పష్టం చేసింది. గ‌న్నిపై బ‌ల‌మైన న‌మ్మ‌కంతోనే చంద్ర‌బాబు సైతం ఏలూరు జిల్లా పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించ‌గా… ఆ ప‌ద‌వి విష‌యంలోనూ స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వంతో ఆయ‌న‌కు మంచి మార్కులే వేయించుకున్నారు.

Tags: ap politics, ganni veranjineyu, tdp