అసెంబ్లీ నుంచి ఈటల ఔట్..!

తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను ఈ సెషన్ వరకు సస్పెండ్ చేశారు. ఈ మేరకు స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఈటల రాజేందర్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. స్పీకర్ మరమనిషిలా వ్యవహరిస్తున్నారని విపక్ష నేతలను మాట్లాడనివ్వడం లేదని ఈటల ఆరోపించారు. ఇదిలా ఉంటే ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. శాసనసభావ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈటల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. సభాపతిని అగౌరవపరిచేలా ఈటల రాజేందర్ వ్యవహరించారని.. ఆయన తన మాటలను వెనక్కి తీసుకోవాలని.. సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సారీ చెప్పాలంటూ పట్టుబడ్డారు. కాగా అందుకు ఈటల రాజేందర్ నిరాకరించారు. తానేమీ తప్పుగా మాట్లాడలేదని పేర్కొన్నారు. మరమనిషి అన్న పదం అన్ పార్లమెంటరీ కాదంటూ సమర్థించుకొనే ప్రయత్నం చేశారు. దీంతో స్పీకర్ ఆయనను 8వ సెషన్ ముగిసే వరకు సభనుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సభ నుంచి వెళ్లిపోవాలని ఈటలకు సూచించారు. అనంతరం ఈటల రాజేందర్ సభ నుంచి బయటకు వెళ్లి.. ఈ విషయం మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అందుకు పోలీసులు నిరాకరించారు. ఆయనను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తీసుకెళ్లారు.


తీవ్ర భూ ఆరోపణలు రావడంతో.. పార్టీలో ఇమడలేని పరిస్థితి ఉండటంతో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. తదనంతర పరిణామాల్లో ఆయన బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. హుజూరాబాద్ లో గెలుపొందారు ఈ ఎన్నిక కూడా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగింది. ఇదిలా ఉంటే అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఈటల రాజేందర్ కు సమావేశాల్లో మాట్లాడే అవకాశం రావడం లేదు.

Tags: BJP Telangana, etela rajendra prasad, telangana politics