ఒక్కటి మాత్రం నిజం 2004లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ఐదేళ్ల పాలన బాగా ఎంజాయ్ చేశారు. 2009లో గెలిచిన కాంగ్రెస్ నేతలు వైయస్ మృతితో అంత గొప్పగా అధికారం ఎంజాయ్ చేయకపోయినా.. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి పాలనలో ఉన్నంతలో సంతృప్తి చెందారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత టిడిపి నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులు అందరూ ఎమ్మెల్యేలు తమ తమ స్థాయిల్లో బాగానే అభివృద్ధి పనులు చేపట్టారు. సంతృప్తికరమైన పాలన కొనసాగించారు.
2019లో వైసీపీ నుంచి ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఎవరో నలుగురైదుగురు మినహా ఎవరు కూడా ఎమ్మెల్యే పవర్ ఎంజాయ్ చేయలేదు. అసలు నియోజకవర్గాలలో చాలా పనులు ఎమ్మెల్యేలకు తెలియకుండానే జరిగిపోతున్నాయి. అసలు అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రిని కలిసి చెప్పుకునే భాగ్యం కూడా లేదు. చాలామంది ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి దర్శన భాగ్యం కలగటం లేదు.
మరి కొందరు అయితే అసలు తాము అసలు ఎమ్మెల్యేలమేనా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక వైసీపీ ఎంపీలు పూర్తిగా డమ్మీలు అయిపోయారు. గత ఎన్నికలలో కోట్లాది రూపాయల ఖర్చు పెట్టి ఎంపీలుగా గెలిచిన వారంతా చిన్న చిన్న పనులు కూడా చేయించుకోలేక లబోదిబోమంటున్నారు. ఇప్పుడున్న వైసీపీ ఎమ్మెల్యేలలో చాలామంది వచ్చే ఎన్నికలలో పోటీకి కూడా దూరం అంటున్నారు. మరికొందరు వ్యక్తిగత కారణాలు చెప్పి పోటీ నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు.
యువకులుగా ఉంటూ ఏదో చేయాలన్న తపనతో ఎంపీలుగా గెలిచిన లావు శ్రీకృష్ణదేవరాయులు – కోటగిరి శ్రీధర్ లాంటి వారు అయితే వచ్చే ఎన్నికలలో పోటీ చేయకుండా ఉంటేనే మంచిదన్న అభిప్రాయానికి వచ్చారు అంటే వారు ఎంత విసిగిపోయారో తెలుస్తోంది. ఇక చింతా అనురాధ – మాధవి – సత్యవతి లాంటి మహిళా ఎంపీలు ఉన్నారో లేదో కూడా తెలియదు. ఇక రాజకీయాల్లో ఎప్పటినుంచో ఉన్న కాకినాడ ఎంపీ వంగా గీతది కూడా అదే పరిస్థితి. పూర్తి డమ్మీగా మారిపోయారు.
పోలీస్ గా ఉన్నప్పుడు హీరోగా పేరు తెచ్చుకున్న గోరంట్ల మాధవ్ ఎంపీ అయ్యాక అసలు మూడేళ్లగా ఆయన మాటే వినపడటం లేదు. మా గుంట శ్రీనివాస్ల రెడ్డి – ఆధాల ప్రభాకర్ రెడ్డి అసలు ఎంపీ పదవి వేస్ట్ అన్న నిర్ణయానికి వచ్చేసారట. జగన్ వైఖరితో విసిగిపోయిన రఘురామ కృష్ణంరాజు పార్టీకి ఎప్పుడో దూరమయ్యారు. మరికొందరు ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని చూస్తున్నారు. ఏది ఏమైనా వైసీపీలో చాలామంది వచ్చే ఎన్నికలలో పోటీకి ఇష్టపడటం లేదన్నమాట వాస్తవం.