ఏపీలో మరికొన్ని నెల్లలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ఈ ఎన్నికల్లో వైసీపీ ఒంటరి పోరుకు రెడీ అయింది. కానీ, టీడీపీ- బీజేపీతో పొత్తుకోసం ప్రయత్నాలు చేస్తోంది. అన్ని మార్గాల్లోనూ టీడీపీ తన ప్రయత్నాలు తాను చేస్తోంది. బీజేపీతో వెళ్తే.. వచ్చే ఎన్నికలలో విజయం తమను వరిస్తుందని.. టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తుండవచ్చు. ఎన్నికల మేనేజ్ మెంట్‌లో వైసీపీకి చెక్ పెట్టడం ద్వారా ఆయన విజయం దక్కించుకోవాలని చూస్తుండవచ్చు.
కానీ, ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటి? ఆ పార్టీకి ఉన్న మద్దతుదారులు ఎందుకు? ఆ పార్టీ ఓటు బ్యాంకు ఎంత? వంటి కీలక విషయాలను పరిశీలిస్తే.. కేంద్రంలోను కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లోనూ బీజేపీ అదికారంలో ఉన్నప్పటికీ.. దక్షిణాదిలో మాత్రం ఆ పార్టీ పరిస్థితి జీరోగానే ఉంది. పైగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుం డా.. మోసం చేశారనే చర్చ బీజేపీపై ఇప్పటికీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినిపిస్తున్న మాట.
అదేసమయంలో రాష్ట్రానికి అధిక మొత్తంలో అప్పులు ఇస్తూ.. గ్రాంట్లు ఎగ్గొడుతూ.. ఏపీని అప్పుల కుప్పగా చేయడంలోనూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక కారణంగా మారిందనే చర్చ కూడా మేధావుల మధ్య వినిపిస్తోంది. ఇక, విభజన చట్టం హామీలను నెరవేర్చలేదు. కడప స్టీల్ ప్లాంటును ముందుకు సాగనివ్వ డం లేదు. వెనుక బడిన జిల్లాలకు నిధుల విషయాన్ని ఎప్పుడో అటకెక్కించేశారు. ఇలా.. ఏ విధంగా చూ సుకున్నా ఏపీకి బీజేపీ చేసిన మేలు ఏంటి? అనేది ప్రశ్నార్థకమే.
పోనీ.. ఈ వాదన ఎలా ఉన్నా.. క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకు బాగుంది. కాబట్టి.. బీజేపీతో కలిసి నడిస్తే తప్పేంటని చంద్రబాబు వంటి సీనియర్లు ప్రశ్నించవచ్చు. కానీ, ఇది నేత బీరలో నెయ్యి చందమే కదా. క్షేత్రస్థాయిలో బీజేపీ పరిస్థితి దారుణంగా ఉందనే విషయం.. ఓటు బ్యాంకు షేరును బట్టి స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఎలా చూసుకున్నా కూడా.. బీజేపీ వల్ల ఇతర పార్టీలకు కానీ.. ఇతర నాయకులకు కానీ ఎలాంటి ప్రయోజనమూ కలిగేలా కనిపించలేదు. ఇలాంటప్పుడు బీజేపీతో చెలిమి చేసేందుకు టీడీపీకి ఎందుకు అంత చొరవ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.