తాజాగా ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాల తర్వాత క్యాబినెట్ మంత్రులకు సీఎం వైఎస్ జగన్ క్లాస్ తీసుకున్నారు. మంగళవారం సీఎం అధ్యక్షతన క్యాబినెట్ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల తో పాటు మంత్రులు ఎవరేం చేస్తున్నారో ? అందరి పనితీరు గమనిస్తున్నానని చెప్పారట జగన్. తేడాలు వస్తే మంత్రులను మార్చేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలను గెలిపించే బాధ్యత కూడా సీఎం మంత్రులకు కట్టబెట్టారట.
ఒక్కో మంత్రికి ఆరుగురు ఎమ్మెల్యేల బాధ్యతలను జగన్ అప్పగించారు. ఇచ్చిన బాధ్యతలు సరిగ్గా నిర్వహించకపోతే పరిస్థితులు వేరేలా ఉంటాయని కూడా జగన్ చెప్పేసినట్టు తెలుస్తోంది. మంత్రులు పనితీరు బాగోలేదని.. ముగ్గురు మంత్రులను పదవుల నుంచి తప్పించడానికి కూడా తాను ఏమాత్రం వెనకాడనని సీఎం తేల్చి చెప్పేసారట. జగన్ స్వయంగా ఈ కామెంట్ చేయడంతో మంత్రులలో టెన్షన్ మొదలైందని అంటున్నారు.దీంతో క్యాబినెట్ నుంచి ఎవరెవరిని ? తొలగిస్తారు అన్నదానిపై అటు మంత్రుల్లోనూ ఇటు వైసిపి నేతలలోను చర్చ అయితే జరుగుతుంది.
పార్టీ వర్గాల్లో నడుస్తున్న చర్చ ప్రకారం ఆ ముగ్గురులో ఇద్దరు కోస్తా జిల్లాలకు చెందిన మంత్రులు కాగా మరొకరు రాయలసీమకు చెందినవారు అని తెలుస్తోంది. ఆ ముగ్గురు మంత్రుల స్థానంలో ముగ్గురు ఎమ్మెల్సీలను జగన్ క్యాబినెట్లోకి తీసుకోవాలని భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత నెలలోనే జగన్ క్యాబినెట్ సమావేశంలో కోస్తాకు చెందిన ఒక మంత్రికి… రాయలసీమకు చెందిన మరో మంత్రికి క్లాస్ తీసుకున్నారు. ఒకరు అనవసరంగా వేరే నియోజకవర్గం లో తలదూర్చుతుంటే మరో మంత్రిపై భూతగాదాల ఆరోపణలు వచ్చాయి. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ మళ్లీ ఆ ఇద్దరి ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది. ఏదేమైనా జగన్ వార్నింగ్ తో వైసిపి మంత్రుల్లో టెన్షన్ అయితే మామూలుగా లేదు.