ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల వేడి మామూలుగా లేదు. ముఖ్యంగా మూడు జనరల్ స్థానాలు అయిన కొత్తగూడెం, ఖమ్మం, పాలేరులో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య నరాలు తెగే పోరు ఉంటుందనుకున్నా కొన్ని చోట్ల పోటీలో ఉన్న కొందరు నేతల మబ్బులు వీడుతున్నాయి. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాలేరులో కాంగ్రెస్ తరపున పోటీలో ఉన్నారు. ఆయనపై బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి పోటీలో ఉన్నారు.
కాంగ్రెస్ కండువా కప్పుకున్న వెంటనే పొంగులేటికి ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర పీసీసీ కార్యదర్శి పదవి కట్టబెట్టింది. కాంగ్రెస్‌లోకి వచ్చిన వెంటనే పొంగులేటి భారీ డైలాగులు వేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తోన్న ఒక్క అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేటు తాకనీయను అని చెప్పారు. జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పటికే రెండుసార్లు కౌంటర్లు కూడా ఇచ్చారు. ఉమ్మడి జిల్లా పరిస్థితి ఏమోగాని ఇప్పుడు పొంగులేటి పాలేరులోనే ఏటికి ఎదురీదుతోన్న పరిస్థితి.
పొంగులేటికి పాలేరు కాంగ్రెస్ టిక్కెట్ అన్న వెంటనే ఒక్కసారిగా పాలపొంగులా క్రేజ్ ఎగసి ఢాంన కిందపడింది. ఎన్నికల ప్రచార గడువు దగ్గరపడుతోన్న కొద్ది నియోజకవర్గంలో ఆయన గ్రాఫ్ ఢమాలున పడుతోంది. రాష్ట్ర పీసీసీ ప్రచార కార్యదర్శిగా పేరుకు మాత్రమే ఉన్నా పాలేరులో గెలిచేందుకు తన భార్య, కుమార్తె, అల్లుడు, కుమారుడుతో పాటు ఇతర కుటుంబ సభ్యులు, తన కంపెనీలకు చెందిన అనుచరగణాన్ని భారీ ఎత్తున దించారు.
వీరంతా కాలికి బలపం కట్టుకుని మరీ తిరుగుతున్న పరిస్థితి. దీనికి తోడు పొంగులేటికి పాలేరుకు అంత అనుబంధం లేదు. గతంలో ఓ సారి ఎంపీగా గెలిచినా ఆ ఐదేళ్లలో ఆయన చుట్టపు చూపుగా కూడా ఇక్కడకు వచ్చిన దాఖలాలు లేవు. దీనికి తోడు ఇక్కడ స్థానిక కేడర్‌కు ఆయనకు కూడా ఏ మాత్రం అనుబంధం ఏర్పడలేదు. పొంగులేటి టీంతో పాటు ఆయన అనుచరుల హడావిడే కనిపిస్తోందే తప్పా క్షేత్రస్థాయిలో ఆయన కనీసం మండలానికి 10 గ్రామాల పేర్లు, ప్రతి గ్రామంలో కొందరు కాంగ్రెస్ నేతల పేర్లు కూడా చెప్పే పరిస్థితి లేదు.
ఏదేమైనా పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు దాటనీయకపోవడం సంగతేమో గాని.. ముందు ఆయన అసెంబ్లీ గేటు తాకుతాడా ? అంటే ఎస్ అని ఆయన వీరాభిమానులు అనలేని పరిస్థితి.