చిత్రసీమలో ఇప్పుడంతా బయోపిక్‌ల హవా కొనసాగుతున్నది. అందులో ముఖ్యంగా ఆటల్లో ఆరితేరి.. తమ ప్రతిభతో పతకాలను సాధించి,, దేవ ఖ్యాతిని ఇనుమడింపజేసిన క్రీడాకారులకు సంబంధించిన జీవిత గాథలు వెలుగులోకి వస్తున్నాయి. కమర్షియల్ హంగులను జోడించుకుని వెండితెరపై వెలుగొందుతున్నాయి. ప్రేక్షకులను ఓలలాడిస్తున్నాయి. అది బాలివుడ్, టాలివుడ్, హాలివుడ్ అనే కాగా ప్రతి భాషలోనూ అలాంటి చిత్రాలు వరుసగా వస్తున్నాయి. అంతేకాదు అవి చక్కటి విజయాన్ని సాధించడమే గాక యువతలో స్ఫూర్తిని నింపుతుండడం అభినందనీయం. బాక్సాఫీసు వద్ద కాసులను కురిపిస్తూనే, సమాజానికి మంచి సందేశాన్ని అందిస్తున్నాయి. అలా నిలిచిన పలు చిత్రాల గురించి ఇక్కడ చెప్పుకొందాం.
బాలీవుడ్‌లో బయోపిక్స్ ట్రెండ్ మిగతా అన్ని చిత్ర పరిశ్రమల కన్నా ఎక్కువగా సాగుతున్నది. ఆటల వీరులకు సంబంధించిన కథలను వెండితెర మీదకు తీసుకురావడంపై దర్వక నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందుకు ప్రత్యేక కారణం కూడా ఉంది. ఖర్చు తక్కువ కావడం తదితర కారణాలున్నాయి. అవి ప్రస్తుతానికి ఇక్కడ అనవసరం. ఇక అసలు విషయానికి వస్తే ఇప్పటికే గత దశాబ్దకాలంలో క్రీడల నేపథ్యంలోనే అనేక కథలు తెరకెక్కాయి. ఇటీవల కాలంలో వాటి సంఖ్య అమాంతం పెరిగిపోయింది బాలివుడ్‌లో. ఇప్పటికే భాగ్ మిల్కా భాగ్, దంగల్, ధోని వంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడమే గాక అందరినీ ఆకట్టుకున్నాయి. ఇంకా 1983 వరల్డ్ కప్ నేపథ్యంలో ఒక సినిమా, మహిళా క్రికెటర్ మిథాలి రాజ్ జీవితగాథ ఆధారంగా తాస్పీ పన్ను ప్రధాన పాత్రలో మిథూ చిత్రాలు ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్నాయి. త్వరలోనే విరాట్ కోహ్లీ జీవితం కూడా తెరమీదకు రానున్నట్లు ప్రచారం సాగుతున్నది.
ఇదిలా ఉండగా తాజాగా క్రికెట్ లెజెండ్, దాదా సౌరవ్ గంగూలి జీవితాన్ని వెండితెరమీదకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు నిర్మాత కరణ్ జోహర్. అందు కోసం ఇప్పటికే గంగూలీతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారట. అదీగాక గంగూలీ పాత్ర కోసం హృతిక్ రోషన్ పేరును పరిశీలిస్తున్నారట. మైదానంలో దాదా చూపించిన దూకుడు స్వభావం, కెప్టెన్‌గా ఆయన సాధించిన విజయాలు వంటి చాలా కీలక అంశాలను తీసుకుని కథను సిద్ధం చేయిస్తున్నారట. పక్కా కమర్షియల్ సినిమాలా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నారట.
ఇక టాలివుడ్ లోనూ క్రీడల నేపథ్యంలో ఉన్న సినిమాలు చాలానే వచ్చాయి. గతంలో అశ్వీనీ నాచప్ప ఇతివృత్తాంతంతో ఒకే సినిమా తెరమీదకు వచ్చింది. ఇటీవల కాలంలో క్రీడల కథాంశంతో తెరకెక్కి మంచి విజయాన్ని సాధించిన చిత్రాలు అనేకముండడం విశేషం. రగ్బీ ఆట నేపథ్యంలో సై, కబడ్డీ నేపథ్యంలో ఒక్కడు, తైక్వాండో నేపథ్యంలో భద్రాచలం, ఇటీవల కాలంలో క్రికెట్ నేపథ్యంలో కౌసల్య కృణ్ణమూర్తి, జెర్సీ తదితర చిత్రాలు ఉన్నాయి. అవన్నీ చక్కటి విజయాన్ని సాధించాయి. అంతేకాదండోయ్ కోలివుడ్‌లోనూ ఇదే తరహా చిత్రాలు వచ్చాయి. ఇటీవలే ఇలయరాజ దళపతి విజయ్ నటించిన విజిల్ సినిమా బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. ఇలా ప్రతి బాషా చిత్రమూ క్రీడా నేపథ్యమున్న చిత్రాలను తీసేందుకు ఇప్పుడు ముందుకు వస్తున్నది. కమర్షియల్ హంగులను, నాటకీయతను జోడిస్తూ క్రీడాకారుల జీవితాలను వెండితెరపై చూపుతూ అఖండ విజయాన్ని సాధిస్తున్నాయి. ఏదేమైనా మరుగున పడిన క్రీడాకారులు ఎంతో మంది జీవిత గాథలు ఇప్పుడు వెలుగులోకి రావడమేగాక, యువతలో స్పర్తిని నింపుతున్నాయి.