జూనియర్ ఎన్టీఆర్‌కు ఏం ఖర్మ – సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫైర్..

సీపీఐ నేత నారాయణ మరోసారి నోటికి పనిచెప్పారు. జూనియర్ ఎన్టీఆర్‌ను కాస్త ఘాటుగానే విమర్శించారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై నోరుపారేసుకొని.. ఆ తర్వాత వెనక్కి తగ్గిన నారాయణ ఇప్పుడు తారక్ మీద పడ్డారు. తారక్.. అమిత్ షాను కలవడం ఆయనకు కోపం తెప్పించింది. దీంతో తారక్, అమిత్ షాను కలిపి తిట్ల దండకం అందుకున్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘జూనియర్ ఎన్టీఆర్.. అమిత్ షాను ఎందుకు కలిసినట్టు.. అమిత్ షా ఓ స్మగ్లర్. అతడిమీద ఎన్నో కేసులు ఉన్నాయి. గతంలో మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో అమిత్ షా ఎన్నో తప్పుడు పనులు చేశారు’ అంటూ ఫైర్ అయ్యారు.

మరోవైపు బీజేపీపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ కూడా నీచ రాజకీయాలు చేస్తోందని.. సినిమా హీరోల వెంటపడుతోందని వ్యాఖ్యానించారు. ‘జూనియర్ ఎన్టీఆర్ తాత, తండ్రి మంచివారు. ఆయనకు ఎందుకు అంత ఖర్మ పట్టిందో నాకు అర్థం కావడం లేదు.’ అని వ్యాఖ్యానించారు.

జగన్‌ను కేసీఆర్ ఒప్పించాలి

జాతీయ రాజకీయాల్లో బీజేపీని నిలువరించే ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు నారాయణ కితాబిచ్చారు. కేసీఆర్ బిహార్ వెళ్లి సీఎం నితీశ్‌కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో భేటీ కావడాన్ని స్వాగతించారు. బీజేపీ వ్యతిరేక కూటమిని కలిసినందుకు కేసీఆర్ ను అభినందిస్తున్నానని, ఇది ముఖ్యమైన పరిణామం అన్నారు.

అలాగే కేసీఆర్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కూడా కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు ఒప్పించాలన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కేసీఆర్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల విషయంలో దర్యాప్తు సంస్థలు కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నాయని ఎద్దేవా చేశారు.

Tags: jr ntr, narayana murthy, ntr, tollywood news