స్టార్ హీరో విక్ర‌మ్‌కు తీవ్ర గాయాలు… విరిగిపోయిన ప‌క్క‌టెముక‌లు.. !

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్ర‌మ్‌కు షూటింగ్‌లో గాయాలు అయ్యాయి. ఇటీవ‌లే ఈ స్టార్ హీరో మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పొన్నియ‌న్ సెల్వ‌న్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. తాజాగా తంగ‌లాన్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో విక్ర‌మ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంట‌నే ఆసుప‌త్రికి తీసుకువెళ్లి ప‌రీక్ష‌లు చేయ‌గా ప‌క్క‌టెముక‌లు విరిగిపోయాయని.. వెంట‌నే ఆప‌రేష‌న్ చేయాల‌ని వైద్యులు చెప్పిన‌ట్టుగా తెలుస్తోంది.

 

తంగ‌లాన్ షూటింగ్ సీన్లు రిహార్స‌ల్ చేస్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ ప్ర‌మాదంతో విక్ర‌మ్ కొద్ది రోజుల పాటు షూటింగ్‌కు దూరంగా ఉండాల్సి వ‌స్తోంద‌ట‌. ఇటీవ‌ల పొన్నియ‌న్ సెల్వ‌న్ 2 విజ‌య‌వంతం కావ‌డంతో విక్ర‌మ్ అభిమానులు ఆనందోత్సాహాల‌తో ఉన్నారు. ఇంత‌లోనే ఈ ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో విక్ర‌మ్ అభిమానులు తీవ్ర ఆందోళ‌న‌తో ఉన్నారు.

ప‌రిస్థితి కాస్త ఇబ్బంది క‌ర‌మే అయినా.. విక్ర‌మ్‌కు ఆప‌రేష‌న్ జ‌రిగి కోలుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని కూడా చెపుతున్నార‌ట‌. ఇదిలా ఉంటే తంగ‌లాన్ సినిమాకు క‌బాలీ, కాలా సినిమాల డైరెక్ట‌ర్ పా. రంజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మాళ‌విక మోహ‌న్‌, పార్వ‌తీ మీన‌న్‌, ప‌శుప‌తి ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.

ఫీరియాడిక‌ల్ సినిమాగా తెర‌కెక్కే ఈ సినిమాలో విక్ర‌మ్ ఓ గిరిజ‌న యువ‌కుడి పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ పాత్ర కోసం విక్ర‌మ్ ప్రోస్త‌టిక్ మేక‌ప్ వేసుకుని మ‌రీ న‌టిస్తున్నాడు. జ్ఞాన‌వేల్ రాజా గ్రీన్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తోన్న ఈ సినిమాకు జీవీ ప్ర‌కాష్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు.