పొద్దున్నే లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండనిదే క్షణం గడవదు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ అతిగా వాడుతున్న ఈ మొబైల్ ఫోన్ కు సంబంధించిన కఠినమైన నిజం ఒకటి తాజాగా అధ్యయనం రూపంలో బయటకు వచ్చింది. గడిచిన కొంతకాలంగా పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇస్తుంటే అది ఒక అలవాటుగా మారింది. అన్నం తినిపించడానికి… చెప్పిన మాట విననప్పుడు… ఇలా ఏదో ఒక కారణంతో స్మార్ట్ ఫోన్ పిల్లల చేతికి ఇచ్చేస్తున్నారు.
దాని వినియోగం పిల్లల్లో పెరిగే కొద్దీ ఎటువంటి నష్టాలు వస్తాయో వాషింగ్టన్ కు చెందిన సరియన్ ల్యాబ్స్ చేసిన రీసెర్చ్ వెల్లడించింది. గ్లోబల్ మైండ్ ప్రాజెక్ట్ లో భాగంగా ఈ రీసెర్చ్ ని 41 దేశాలకు చెందిన 18-24 ఏళ్లు మధ్య ఉన్న 27,969 మందిపైన రీసెర్చ్ చేశారు. దీనివల్ల తేలిందేమంటే.. చిన్న వయసులో స్మార్ట్ ఫోన్ ఉపయోగించిన వారికి పెద్ద వయసుకు వచ్చేసరికి వారి మానసిక స్థితి బలహీనంగా ఉందని వైద్యులు గుర్తించారు. ఈ పరిస్థితి యువకులతో పోలిస్తే యువతుల్లో ఎక్కువగా ఉందని తేల్చారు. ఉత్తర అమెరికా, యూరోప్, లాటిన్ అమెరికా, ఓషియానియా, దక్షిణాసియా, ఆఫ్రికా ప్రాంతాల్లోని యువత మానసిక పరిస్థితులను 47 అంశాల ఆధారంగా ఈ రీసెర్చ్ చేపట్టారు.
అబ్బాయిలు ఆరేళ్ల వయసు నుంచి ఫోన్ వాడడం మొదలు పెట్టిన వారిలో 42 శాతం మందికి మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. 18 ఏళ్ల వయసులో ఫోన్ వాడడం మొదలు పెట్టిన వారు 36 శాతం మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. ఇది ఇలా ఉంటే అమ్మాయిల్లో ఆరేళ్ల నుంచి ఫోన్ వాడుతున్న వారిలో 74 శాతం మంది సమస్యల్ని ఎదుర్కొంటున్నారు.
వయసు పెరిగిన తర్వాత సెల్ ఫోన్ వాడటం మొదలుపెట్టిన వారిలో దుష్ప్రభావం కొంత తక్కువగా ఉన్న విషయం తెలిపారు. మొబైల్ వాడకం వల్ల మానసిక సమస్యలతో పాటు మంచి కూడా ఉందని చెబుతున్నారు. అబ్బాయిల్లో ఆత్మవిశ్వాసం ఇతరులతో సానుకూల సంబంధాలను నిలపడంతో పాటు సామాజిక దృక్పథం మారినట్లు తెలిపారు. అమ్మాయిలు అయితే మానసిక స్థితి అభివృద్ధి చెందుతున్నట్టుగా గుర్తించారు.