టిడిపి అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికలకు అప్పుడే సమర శంఖం పూరిం చేస్తున్నారు. తను పర్యటిస్తున్న నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. అసెంబ్లీ అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబు లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులు ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉండడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సమీకరణలను కూడా బేరీజు వేసుకోవాల్సి ఉండడంతో ఎంపీ అభ్యర్థుల ఎంపిక కాస్త ఆలస్యం అవుతున్నట్టు కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరం లోక్‌సభ అభ్యర్థిగా కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన యువనేత, పార్టీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి శిష్టా లోహిత్ కు దాదాపు సీటు ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. లోహిత్ గత 7 – 8 నెలలుగా రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో జరిగే పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. అలాగే పార్టీ రాష్ట్ర కార్యక్రమాలతో పాటు స్థానికంగా జరుగుతున్న పార్టీ కార్యక్రమాలకు తన వంతుగా ఆర్థిక సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు.
రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడుకు కూడా భారీగా విరాళం ఇచ్చి రాష్ట్రస్థాయిలో హైలైట్ అయ్యారు. అలాగే పార్టీ ఆఫీసులో పార్టీ కోసం పనిచేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నుంచి లోహిత్ కు సూచాయగా సంకేతాలు వచ్చినట్టు కూడా తెలుస్తోంది. వాస్తవానికి రాజమహేంద్రవరం పార్లమెంటు సీటును తెలుగుదేశం పార్టీ ఎక్కువగా కమ్మ సామాజిక వర్గానికి కేటాయిస్తూ వస్తోంది. గత మూడు ఎన్నికలలోనూ మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్, ఆయన కోడలు మాగంటి రూపాదేవి పోటీ చేశారు. ప్రస్తుతం మాగంటి కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ? బరిలోకి దింపాలనే దానిపై పార్టీలోనూ తర్జనభర్జనలు జరిగాయి.
స్థానిక నేత అయిన బొడ్డు వెంకటరమణ చౌదరి కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఆ పేరు కూడా పరిశీలనకు వచ్చింది. దివంగత సీనియర్ నేత బొడ్డు భాస్కర రామారావు తనయుడు వెంకటరమణ చౌదరి 2014లో వైసీపీ నుంచి ఇక్కడ ఎంపీగా పోటీ చేసి మురళీమోహన్ చేతిలో ఓడిపోయారు. అయితే కొద్ది రోజుల క్రితం వెంకటరమణ చౌదరికి ఇదే పార్లమెంటు పరిధిలోని రాజానగరం ఇంచార్జ్ పగ్గాలు ఇవ్వడంతో ఎంపీ రేసు నుంచి వెంకటరమణ చౌదరి తప్పుకున్నట్టు అయింది. వాస్తవానికి చౌదరి పెద్దాపురం సీటు ఆశించగా అక్కడ చిన్న రాజప్పకు చంద్రబాబు టిక్కెట్ ఖరారు చేయడంతో సర్దుబాట్లలో భాగంగా వెంకటరమణ చౌదరిని రాజానగరం పంపారు.
దీంతో ఎంపీ సీటు రేసులో ఇప్పుడు లోహిత్ ఒక్కరే ఉండడంతో దాదాపు లైన్ క్లియర్ అయినట్టే కనిపిస్తోంది. లోహిత్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన యువకుడు కావడం విశేషం. గతంలో కాంగ్రెస్ నుంచి ఇదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ రాజకీయ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ రెండుసార్లు ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే. ఇక లోహిత్ మృదుస్వభావి కావడం… రాజకీయాలకు కొత్త కావడం కూడా కలిసి రానుంది. త్వరలోనే లోహిత్ లోక్‌సభ అభ్యర్థిత్వంపై అధిష్టానం క్లారిటీ ఇవ్వనుంది.