సాంకేతిక విజ్ఞానం పెరగడంతో నేరగాళ్లు వినూత్న పద్ధతులతో మోసాలకు పాల్పడుతున్నారు. కొందరు బ్యాంకుల్లోని నగదును చాకచక్యంగా స్వాహ చేస్తున్నారు. మరికొందరు అమాయకులను.. వ్యసనపరులను ఎంచుకుని జేబులకు కన్నం పెడుతున్నారు. వేలకు వేలు గుంజుతున్నారు. వీరి బారిన పడి అనేక మంది విలవిల్లాడుతున్నారు. తాజాగా అలాంటి సంఘటనే తమిళనాడు రాజధాని చెన్నైలో వెలుగు చూసింది. మిమిక్రీ విద్య తెలిసిన ఓ ప్రబుధ్దుడు అమ్మాయిల మాట్లాడుతూ మగాళ్లను ట్రాప్‌లోకి దించుతున్నాడు. ఆపై వేలవేలకు గుంజుతున్నాడు. అలా అతగాడి బారిన పడిన ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..
చెన్నై పట్టణంలోని మైలాపూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్ నెట్ బ్రౌజ్ చేస్తుండగా అతగాడి దృష్టికి ఓ రోమాంటిక్ యాప్ కనిపించింది. దీంతో వెంటనే దానిని డౌన్లోడ్ చేసుకున్నాడు. అంతే ఆ వెంటనే అవతలి నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. లిఫ్ట్ చేయడంతో ఓ లేడీ స్వీట్ వాయిస్‌తో మాటలు మొదలు పెట్టింది. కొద్ది నిముషాల తరువాత నేరుగా అసలు విషయానికి వచ్చింది. తన అకౌంట్‌కు రూ.100 పంపిస్తే తన నగ్న చిత్రాన్ని పంపిస్తానని ఆఫర్ చేసింది. దీంతో సదరు యువకుడు వెంటనే ఆమె అకౌంట్‌కు డబ్బులను ట్రాన్స్ఫర్ చేశాడు. చెప్పినట్లుగా ఆ లేడీ ఓ నగ్న చిత్రాన్ని పంపించింది. ఆ వెంటనే మళ్లీ ఫోన్ చేసి ఈ సారి వీడియో కూడా పంపిస్తాను.. అవసరమైతే నేరుగా కూడా రావచ్చు. కాకపోతే అందుకు వేర్వేరుగా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయాలని ఊరించింది. అయితే అందుకు ఇష్టపడని ఆ యువకుడు వెంటనే కాల్ కట్ చేశాడు. ఆ నంబర్‌ను బ్లాక్ చేశాడు.
ఇదిలా ఉండగా ఇటీవల అతని సెల్‌కు ఓ మెసేజ్ వచ్చింది. అది ఒక్కసారిగా హడలిపోయాడు. పోలీసు స్టేషన్లో కేసు పెట్టానని, అడిగినంత ఇవ్వకపోతే ఫొటోల వ్యవహారం మొత్తం చెప్పేస్తానని ఆ లేడీ వార్నింగ్ చూసి బిత్తరపోయాడు. దీంతో ఆందోళనకు గురైన సదరు యువకుడు వెంటనే మైలాపూర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు వివరాలను ఆరా తీశారు. తీరా అదంతా చేసింది మరో యువకుడని తెలిసి నోరెళ్లబెట్టారు. వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా మిమిక్రీ తెలుసుని తనే మహిళ గొంతుతో మాట్లాడానని, గత నాలుగేళ్లుగా ఇలా సుమారు 350 మంది వరకు తన వలకు చిక్కారని సదరు నిందితుడు వెల్లడించడంతో మరింత కంగుతిన్నారు. దీంతో పలు
సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.