తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల మధ్య టిడిపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి అధికారులు శనివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. శనివారం రాత్రి అంతా చంద్రబాబుకు నిద్రపోయే అవకాశం లేకుండా అటు పోలీసులు.. ఇటు సిఐడి అధికారులు ఇబ్బంది పెట్టారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. విచిత్రం ఏంటంటే అరెస్టు చేసిన 24 గంటల్లో కోర్టులో హాజరు పరచడం తప్పనిసరి కావడంతో హుటాహుటిన ఆదివారం ఉదయాన్నే ఆయన ఏసీబీ కోర్టుకు తీసుకువెళ్లారు.
చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని సిఐడి మెమో దాఖలు చేసింది. అయితే ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేకపోవడంతో సిఐడి అప్పటికప్పుడు మెమో దాఖలు చేసింది. వాస్తవానికి 2021లో ఎఫ్ఐఆర్ లో ఈ కేసులో ఎక్కడా చంద్రబాబు పేరు లేదు. అయితే ఏసీబీ కోర్టుకు సిఐడి రిమాండ్ రిపోర్ట్ అందించగా కొద్దిసేపటి క్రితమే ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు చేర్చడం గమనార్హం. దీంతో సిఐడి వ్యవహరించిన తీరుపై పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత సిఐడి సంజయ్ చెప్పిన అంశాలనే రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు అధికారి పేర్కొన్నారు. అంటే అరెస్టు తర్వాత రిమాండ్ రిపోర్ట్ లో ఏం పేర్కొనాలని దానిపై సిఐడి చీఫ్ చెప్పిన విషయాలన్నీ ఇక్కడ దర్యాప్తు అధికారి పేర్కొనటం గమనిరహం. ఇక ఎన్ని కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయన్న దానిపై ఒక్కోసారి ఒక్కో ఫిగరు బయటకు వస్తోంది.
ఒకసారి 500 కోట్లు అంటూ మరోసారి 300 కోట్లు అంటూ తాజాగా సిఐడి కోర్టుకు ఇచ్చిన నివేదిక 279 కోట్ల నిధులు దుర్వినియోగం అయినట్టు చెబుతున్నారు. ఇందులో కూడా సరైన క్లారిటీ లేకుండా పోయింది. మరోవైపు ఏసిబి కోర్టులో వాదనలు మొదలయ్యాయి. చంద్రబాబు తరుపున ప్రముఖు న్యాయవాది సిద్ధార్థ లోధా వాదనలు వినిపిస్తున్నారు.