తిరిగిన చోటే తిరగడం, ఎన్నికల మేనిఫెస్టోను ఏకరువు పెట్టడం, క్షేత్రస్థాయిలో తమ్ముళ్లను కదిలించడం… ప్రజలకు – పార్టీకి మధ్య ఏర్పడిన గ్యాప్‌ను సాధ్యమైనంత వరకు తగ్గించడం.. ఇవీ ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు. ఒకరకంగా దీనిని మాస్టర్ ప్లాన్ అనుకోవచ్చు. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న సామెతను చంద్రబాబు అక్షరాలా అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం ఒక్కటే కాదు.. అధికార వైసీపీని అన్ని స్థాయిల్లోనూ అణిచేయాలనే లక్ష్యం తో చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి రాయలసీమ ప్రాంతంలో సుడిగాలి పర్యటనలకు రెడీ అయ్యారు. గుంతకల్లు, రాయదుర్గం, కళ్యాణ దుర్గం నియోజకవర్గా ల్లో కలియ దిరిగి పార్టీని బలోపేతం చేయడంతోపాటు.. పార్టీ నేతల్లోనూ ఆత్మస్థయిర్యం నింపే దిశగా బాబు అడుగులు వేస్తున్నారు.
వాస్తవానికి చంద్రబాబు ఇప్పటికే ఈ ఏడాది కాలంలో రెండు సార్లు రాయల సీమలో పర్యటించారు. ప్రతి నియోజకవర్గాన్ని ఆయన పలకరించారు. తమ్ముళ్లను కూడా గాడిలో పెట్టారు. కీలకమైన అనంతపురం జిల్లాలో ఒకప్పుడు టీడీపీ క్లీన్ స్వీప్ చేయగా.. గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాలలో మాత్రమే పార్టీ విజయం దక్కించుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేయాలనేది పార్టీ నిర్దేశించుకున్న లక్ష్యం.
ఈ క్రమంలోనే తిరిగిన చోటే తిరుగుతూ…. ఎన్నికల మినీ మేనిఫెస్టోపై మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల ని చంద్రబాబు నిర్ణయించుకున్న దరిమిలా.. ఇప్పుడు మరోసారి సీమలో టీడీపీ నాయకులు ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారు. ఇక, తాజా పర్యటన నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. వైసీపీ నేతలను దీటుగా ఎదుర్కొనగలిగే నాయకులను టీడీపీ రంగంలోకి దింపుతుందని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. ఈ సారి `సీమ` రిజల్ట్ డిఫరెంట్ గా ఉంటుందనే సంకేతాలు వస్తున్నాయి.