టీడీపీ అధినేత చంద్రబాబు ఇలా మాట ఇవ్వడం ఆలస్యం.. ఆ పార్టీ కీలక నాయకుడు, బాపట్ల నియోజకవర్గం ఇంచార్జ్ వేగేశ్న నరేంద్ర వర్మ.. ఇలా చేసేశారు. ఈ ఆశ్చర్యకర పరిణామం పార్టీలో ఆసక్తికర చర్చగా మారింది. నిజానికి చంద్రబాబు.. తను చెప్పినట్టు పార్టీ నాయకులు చాలా మంది నడుచుకోవడం లేదని.. ఆవేదన, ఆందోళన కూడా వక్తం చేస్తున్నారు.
ఇప్పటికీ ఎక్కడ పర్యటించినా.. తమ్ముళ్లకు క్లాసు తీసుకుంటున్నారు. మాట వింటారా? లేదా? అని వార్నింగులు కూడా ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా చంద్రబాబు ఇలా మాట ఇవ్వడం .. ఆ పార్టీ నాయకుడు అలా చేయడం నిజంగానే పార్టీలో సంతోషాన్ని నింపింది. ఏం జరిగిందంటే.. ఇటీవల బాపట్లలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మిచౌంగ్ తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటించారు.
రైతులు, ఇతర బాధితులను కలుసుని వారి సమస్యలు, బాధలు, నష్టాన్ని కూడా చంద్రబాబు తెలుసుకుని.. వారికి మనో ధైర్యం కల్పించారు. ఇలా.. బాపట్ల నియోజకవర్గానికి చెందిన సుమారు 270 మంది యానాది కుటుంబాలు తమ గోడును చంద్రబాబుకు విన్నవించుకున్నాయి. తుఫాను కారణంగా.. తాము సర్వస్వం కోల్పాయామని.. పిల్లలు సహా తామంతా పస్తులు ఉంటున్నామని.. చంద్రబాబుకు చెప్పాయి.
దీనికి చలించిపోయిన చంద్రబాబు.. వారికి ధైర్యం చెబుతూ.. ఒక్కొక్క కుటుంబానికి రూ.5 వేల చొప్పున సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు.. ఒక్కొక్క కుటుంబానికీ బియ్యం, పప్పు, నూనెలు సహా వస్త్రాలు కూడా ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఈ సమయంలో సదరు హామీలు విన్న వేగేశ్న నరేంద్ర వర్మ.. కనీసం.. చంద్రబాబు ఇది చెయ్యి. అని నేరుగా ఆదేశించకపోయినా.. ఆ మార్నాడే రంగంలోకి దిగిపోయారు.
బాధితుల వివరాలు సేకరించి.. సోమవారం సాయంత్రం నుంచే వారికి రూ.5 వేలు సహా నిత్యావసరాలు, దుస్తులు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ పరిణామంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. నిజమైన నాయకుడు ఇలా ఉండాలంటూ వర్మ చేసిన సాయం పార్టీలోనూ చర్చనీయాంశం అయ్యింది.