పల్నాడు లోని గురజాలకు చెందిన టిడిపి సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు అంటే నాడు ఎన్టీఆర్ నుంచి నేడు చంద్రబాబు.. ఆయన తనయుడు లోకేష్ వరకు ఎంతో అభిమానిస్తారు. యరపతినేని 30 ఏళ్లుగా టిడిపిలో రాజకీయాల్లో చేస్తున్నారు. మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వాస్తవానికి 2014 లో ఆయన ఎమ్మెల్యేగా మూడోసారి గెలిచాక మంత్రి పదవి వస్తుందనుకున్నారు.. రాలేదు. క్యాబినెట్ విస్తరణలోను మరోసారి యరపతినేనికి క్యాబినెట్ బెర్త్ పక్కా అని ప్రచారం జరిగింది. అప్పుడు కూడా పదవి రాలేదు.
కొన్ని జిల్లాల్లో చాలామంది సీనియర్లు తమ అసమ్మతి గళం వినిపించినా యరపతినేని ఎప్పుడు అధిష్టానంపై కిమ్మనలేదు. ఎప్పుడు పార్టీ లైన్ జవదాటలేదు. అందుకే యరపతినేని అంటే చంద్రబాబుతో పాటు యువనేత లోకేష్ కూడా ఎంతో అభిమానిస్తారు. యరపతినేని మొదటిసారిగా 1994 ఎన్నికలలో గురజాల నుంచి అసెంబ్లీకి పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు. వాస్తవానికి అప్పట్లో మాచర్లలో కాంగ్రెస్ గుండాల ఆగడాలు దారుణంగా ఉండేవి. వారిని ఎదుర్కొనేందుకు అక్కడ కొందరు యువకులు యరపతినేనితోనే అది సాధ్యమవుతుందని భావించి ఎన్టీఆర్ వద్దకు వెళ్లారు.
ఎన్టీఆర్ యరపతినేనికి ముందుగా మాచర్ల సీటు ఖరారు చేశారు. తర్వాత సమీకరణలు మారాయి. మాచర్ల సీటు కుర్రి పున్నారెడ్డికి ఖరారు చేశారు. దీంతో యరపతినేనికి సీటు వస్తుందా ? రాదా అన్న సందేహం నెలకొంది. ఎన్టీఆర్ మాత్రం తాను శ్రీనుకు మాట ఇచ్చాను.. నువ్వు వెళ్లి గురజాలలో నామినేషన్ వేయి అని చెప్పడంతో ఎన్టీఆర్ సూచన మేరకు యరపతినేని గురజాల నుంచి బరిలోకి దిగారు. అయితే మాచర్లలో పార్టీని గెలిపించే బాధ్యత కూడా నీ చేతుల్లో పెడుతున్నానని ఎన్టీఆర్ యరపతినేనికి సూచించారు. అప్పుడు యరపతినేని అన్నగారు రాష్ట్రం అంతట అన్ని నియోజకవర్గాలలో మీ ప్రభావంతోనే గెలుస్తున్నాము… గురజాలలో నేను గెలిచిన మాచర్లలో పార్టీ గెలిచిన మీ ప్రభావమే అని చెబితే.. ఎన్టీఆర్ కాదు కాదు..మాచర్ల గెలుపులో మాత్రం నువ్వు కీలకపాత్ర పోషించాలని చెప్పారు.
ఎన్టీఆర్ గాలి అంతలా వీచినా కూడా మాచర్లలో పున్నారెడ్డి 6 వేల ఓట్లతోనే గెలిచారు. ఎన్టీఆర్ ఆ ఎన్నికల ప్రచారంలో వాడు మాచర్ల కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న పిన్మెల్లి సుందరరామిరెడ్డి అనే వ్యక్తిని గురించి ప్రస్తావిస్తూ మనం రేపు గెలవబోతున్నాం.. అసెంబ్లీలో ఆ వ్యక్తి మొఖం నేను చూడకూడదు ఆ బాధ్యత నీదే అని చెప్పారట. అంటే సుందరరామిరెడ్డి కచ్చితంగా ఓడిపోవాలని ఇచ్చిన టాస్క్ నాడు యరపతినేని దిగ్విజయంగా పూర్తి చేశారు. అంటే అప్పట్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ గుండాల ఆగడాలు అంత దారుణంగా ఉండేవి అట. అయితే ఇప్పుడు కూడా మాచర్లలో అలాంటి పరిస్థితి తాండవిస్తుందని చంద్రబాబు తీవ్రంగా విరుచుకు పడుతున్నారు.
వరుసగా నాలుగు సార్లు గెలుస్తున్న వైసిపి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని ఓడించేందుకు తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుంది. కేవలం మాచర్లమే మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టిడిపి శ్రేణులు కూడా ఒక గుడివాడ, గన్నవరం తర్వాత మాచర్లలో రామకృష్ణారెడ్డి చిత్తుచిత్తుగా ఓడిపోవాలని కసితో రగులుతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు సైతం ఈసారి అక్కడ పార్టీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి ద్వారా కచ్చితంగా రామకృష్ణారెడ్డిని ఓడగొట్టాలని.. అసెంబ్లీలో రామకృష్ణారెడ్డి ఎంట్రీ ఉండకూడదని ఇందుకు నువ్వు కీలకపాత్ర పోషించాలని యరపతినేనికి ఇప్పటికే చాలాసార్లు సూచనలు చేశారు.
యరపతినేని సైతం తన సొంత నియోజకవర్గ గురజాలతో పాటు మాచర్లలో పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తన వంతుగా సూచనలు చేస్తున్నారు. ఇక యరపతినేని స్వగ్రామం మంచి కల్లు కూడా మాచర్ల నియోజకవర్గం లోని ఉన్న విషయం తెలిసిందే. ఏది ఏమైనా యరపతినేని కూడా ఇప్పటికే ఈసారి రామకృష్ణారెడ్డిని ఓడిస్తానని సవాళ్లు రువ్వుతున్నారు. మరి నాడు ఎన్టీఆర్ సుందరరామిరెడ్డిని ఓడించాలని ఇచ్చిన టాస్క్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన యరపతినేని నేడు చంద్రబాబు ఇచ్చిన టాస్క్ ను ఎలా దిగ్విజయం చేస్తారో 2024 ఎన్నికల ఫలితాలే చెప్పనున్నాయి.