ఉండ‌వ‌ల్లి శ్రీదేవికి ఆ సీటు క‌న్‌ఫార్మ్ చేసిన చంద్ర‌బాబు ?

వైసీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తన రాజకీయ భవిష్యత్తుపై దృష్టి సారించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి అభ్యర్థికి ఓటు వేశారన్న కారణంతో ఆమెపై వైసిపి వేటు వేసింది. రాజధాని ప్రాంత ఎమ్మెల్యే అయిన శ్రీదేవి ఇటీవల లోకేష్ సమక్షంలో జరిగిన సభలో యాంకరింగ్ కూడా చేశారు. తాను రాజధాని రైతులకు అన్యాయం చేశానని క్షమాపణ కూడా కోరారు. తన వెనుక లోకేష్- చంద్రబాబు ఉన్నారని చెప్పకనే చెప్పారు.

ఇదిలా ఉంటే త్వరలోనే శ్రీదేవి టిడిపి కండువా కప్పుకోనున్నారు. ఇటీవల చంద్రబాబుతో శ్రీదేవి దంపతులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఎదుట శ్రీదేవి ఒక ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. మామూలుగా ఆమెకు తాడికొండ నుంచి మరోసారి అసెంబ్లీకి పోటీ చేయాలన్న కోరిక ఉంది. అయితే టిడిపిలో తాడికొండ నుంచి చాలామంది ఆశావాహులు ఉన్నారు. పక్కనే ఉన్న ప‌త్తిపాడు సీటు కూడా ఆమె ఆశిస్తున్నారు.

అయితే ప‌త్తిపాడు ఇప్పటికే మాజీ ఐఏఎస్ రామాంజనేయులు కు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో శ్రీదేవి తనకు బాపట్ల లోక్ సభ స్థానం నుంచి సీటు ఇవ్వాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. బాపట్ల లోక్ సభ సీటు ఎస్సీ రిజర్వుడ్ స్థానం. ప్రస్తుతం అక్కడి నుంచి వైసీపీ తరఫున నందిగం సురేష్ ఎంపీగా ఉన్నారు. వైసీపీలో ఉన్నప్పుడే సురేష్ కు, శ్రీదేవికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది.

అయితే ఇప్పుడు శ్రీదేవి టిడిపిలో చేరి అదే సురేష్ పై పోటీకి రెడీ అవుతున్నారు. బాపట్ల లోక్సభ పరిధిలో టిడిపి బలంగా ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఈ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలలో టిడిపి ఈసారి కచ్చితంగా గెలుస్తుంది అన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. అందుకే శ్రీదేవి కూడా ఎలాగో ఎమ్మెల్యే టికెట్ దక్కే ఛాన్సులు లేకపోవడంతో లోక్ సభ సీటుపై గురిపెట్టినట్టు తెలుస్తోంది