టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేయడంతో ఏపీలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎక్కడకక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు రోడ్డు ఎక్కి నిరసనలు చేపట్టాయి. అయితే పోలీసులు రంగంలోకి దిగి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు రాకపోకలను నిలిపివేశారు. తెల్లవారుజామునే పలు ప్రాంతాల డిపోలు.. బస్టాండ్ ల వద్దకు వెళ్లిన పోలీసులు ఆర్టీసీ బస్సులు తిరగకుండా నిలిపివేశారు. కృష్ణ – ఎన్టీఆర్ – గుంటూరు జిల్లాలో తిరిగి అన్ని బస్సులు నిలిచిపోయాయి.
విజయవాడ నగరంలో తిరిగే సిటీ బస్సులు కూడా కదలట్లేదు. ముందస్తు సమాచారం లేకుండా ఉన్నటువంటి బస్సులు ఆపడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక పోలీసులు ఆదేశాలు.. సూచనల మేరకే బస్సుల రాకపోకులపై నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. విశాఖ ద్వారకా నగర్ బస్ స్టేషన్ లో ప్రయాణికులను కిందకు దించేసి బస్సులను డిపోలకు తరలించారు. టికెట్లు తీసుకున్న ప్రయాణికులకు డబ్బులు వాపస్ ఇచ్చారు.
రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులను వేచి ఉండాలని సూచిస్తున్నారు. దీంతో ఉదయాన్నే దూర ప్రాంతాలకు వెళ్లడానికి వచ్చిన వారంతా వెనుదిరిగారు. అనకాపల్లి – నర్సీపట్నం – పాడేరు డిపోల నుంచి ఒక బస్సు కూడా కదలలేదు. విశాఖలో సిటీ సర్వీసులు కూడా నిలిచిపోయాయి. కడప ఆర్టీసీ బస్టాండ్ లో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉదయం 6 గంటల నుంచి ఒక్క బస్సును కూడా పోలీసులు బయటికి పంపలేదు. శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఇదే పరిస్థితి.
ఇక చంద్రబాబునాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచుతున్నారు. పలువురు కీలక నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. మరికొందరిని ఇళ్లలోని హౌస్ అరెస్టులు చేశారు. చంద్రబాబు కుప్పంలోను నిర్బంధాలు కొనసాగుతున్నాయి. ఇక సిపిఐ రామకృష్ణ చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఏదైనా ఉంటే ముందస్తు నోటీసులు ఇచ్చే చర్యలు తీసుకోవాల్సింది అన్నారు. పోలీసులు అర్ధరాత్రి హంగామా సృష్టించాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు.