వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్‌ను చేశారు. ట్విట్టర్ వేదికగా పలు విమర్శలు గుప్పించారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవలే శాసన మండలిలో వైసీపీ ప్రభుత్వ బిల్లులను అడ్డుకోవడం, ఆపై సంబురాలు చేసుకోవడం, పూలు జల్లుకోవడంపై ఘాటు విమర్శలు చేశారు. శాసనమండలిని రద్దు చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించిన వెంటనే పూల ఖర్చు దండుగేనా బాబు ? అంటూ వ్యంగ్యంగానే కామెంట్లు పెట్టారు.
ఇదిలా ఉండగా తాజా మరోసారి చంద్రబాబును లక్ష్యంగా చేసుకున్నారు విజయసాయిరెడ్డి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో ప్రజా సంక్షేమ పథకాల అమలుపై ప్రశంసలు కురిపిస్తూనే, వాటిని చంద్రబాబు ఓర్వలేకపోతున్నారంటూ విమర్శించారు. ‘సంక్షేమ పెన్షన్లను ఒకటో తేదీన ఇచ్చే పద్ధతి దేశంలో ఎక్కడా లేదు. ఇచ్చినా బ్యాంకుల్లోనో, పోస్టాఫీసుల్లోనో తీసుకోవాల్సి ఉంటుంది. సీఎం జగన్ ఆదేశాలతో ఒకటో తేదీనే వలంటీర్లు పెన్షనర్ల ఇళ్లకు వెళ్లి నగదు అందజేస్తున్నారు. ఇంకా చాలా చూడాలి. కళ్లలో నిప్పులు పోసుకోకు బాబూ’ అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేయడం గమనార్హం. అదీగాక ఏపీ రాజధాని అంశంపై చంద్రబాబు, ఎల్లో మీడియా అవలంభిస్తున్న విధానాలను కూడా ఆయన ప్రస్తావించారు. ‘రాజధాని విషయంలో ఎల్లో మీడియా ఎంత రెచ్చగొట్టినా ప్రజల నుంచి కనీస స్పందన లేదు. అమరావతి కృత్రిమ ఉద్యమాల వెనక ఉన్న అసలు కారణం అందరికీ అర్థమయింది. లాభం లేదని జోలె వదిలేసి కౌన్సిల్ పరిరక్షణ పోరాటం మొదలు పెట్టాడు బాబు. ఢిల్లీలో ఎవరి కాళ్లు పట్టుకోవాలో ప్రాక్టీస్ చేస్తున్నాడు అంటూ విజయసాయి రెడ్డి చంద్రబాబుపై ధ్వజమెత్తారు.