కేబినెట్ సబ్‌కమిటీ అందించిన నివేదిక ఆధారంగా టీడీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో చేపట్టిన ప్రాజెక్టులు.. తీసుకున్న కీలక నిర్ణయాలను విచారించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించింది. మాములుగా కాకుండా ఎవరినైనా విచారణకు పిలిచే. అరెస్టు చేసే అధికారాలను సైతం దానికి కట్టబెట్టింది. ఇది ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నది. తెలుగు తమ్ముళ్లు దీనిపై మండిపడుతున్నారు. అధికార వైసీపీపై విరుచుకుపడుతున్నారు. అటు వైసీపీ, ఇటు టీడీపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా సిట్‌పై స్పందిస్తున్నారు. తమ వాణిని వినిపిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. టీడీపీ నేత బోండా ఉమామహేశ్వర్‌రావు సిట్‌పై తనదైన శైలీలో స్పందించారు. కొత్త వాదాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. అధికార వైసీపీపై ఎదురుదాడికి దిగారు. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే.. రస్ ఆల్ ఖైమా కేసు నుంచి అందరి దృష్టిని మారల్చేందుకే ఏపీ సీఎం జగన్ ఈ ఎత్తుగడ వేశారని వివరించారు. అమరావతి భూముల వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసింది అందుకే నని ఆయన ఆరోపించారు. రస్ ఆల్ ఖైమాకు రూ. 800 కోట్లు చెల్లించేందుకు వైసీపీ ఎంపీలను జగన్ ఆ దేశానికి పంపారని ఆరోపించారు. అదీగాక నేరస్థుల ఒప్పందంలో భాగంగా ఆ దేశానికి జగన్‌ను అప్పగించే పరిస్థితి ఉందని, ఈ నేపథ్యంలో ఇటీవలే ప్రధాని మోడీని కలిసి ఆ కేసుల నుంచి బయటపడేయాలని జగన్ వేడుకున్నారని ఎద్దేవా చేశారు. ఆ కేసు విషయంలో వైసీపీ నేతలు అందుకే మాట్లాడడంలేదని వివరించారు. అదిగాకపోతే మరి సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి అయిన నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియా జైల్లో ఎందుకున్నారో జగన్ చెప్పాలని బోండా డిమాండ్ చేశారు. ప్రధాని మోడీతో ఏం మాట్లాడారో చెప్పాలని డిమాండ్ చేశారు. బోండా ఉమా ఆరోపించారు. బోండా చేసిన ఈ వ్యాఖ్యలు వైసీపీ నేతల్లో కలకలం రేపుతుండగా, రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు తెరతీసింది.