బాబూ.. బీసీలు ఇప్పుడు గుర్తుకు వ‌చ్చారా..!

టీడీపీ ప్ర‌భుత్వ ఐదేళ పాల‌న‌పై విచార‌ణ చేప‌ట్టేందుకు ఒక‌వైపు సిట్ ఏర్పాటు చేయ‌డం, మరోవైపు ఈఎస్ ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పేరు తెర‌మీద‌కు రావ‌డంతో ఏపీ రాజ‌కీయాల్లో దుమారం రేగుతున్న‌ది. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అధికా, విప‌క్ష పార్టీల నేత‌లు మాట‌ల యుద్ధానికి దిగుతున్నారు. ప‌రస్ప‌రం ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. పోటాపోటీగా విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే ఆయా అంశాల‌పై నారా లోకేష్‌, చంద్ర‌బాబు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు త‌మదైన శైలీలో స్పందించారు. అధికార పార్టీపై విరుచుకుప‌డ్డారు. ఏమీ చేయ‌లేక సిట్ల పేరుతో కాల‌క్షేపం చేస్తున్నార‌ని ఒక‌రంటే.. బీసీ కులాల‌పై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు జ‌గ‌న్ దిగుతున్నార‌ని మ‌రోక‌రు ధ్వ‌జ‌మెత్తారు.

ఇదిలా ఉండ‌గా.. తాజాగా ఈ అంశంపై ఏపీ నీటిపారుద‌ల శాఖ మంత్రి అనిల్‌కుమార్ స్పందించారు. ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. నెల్లూరు 16వ డివిజన్‌లో పర్యటించిన ఆయ‌న మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు కుల రాజకీయాలు చేస్తుండ‌డం సిగ్గుచేట‌ని ధ్వ‌జ‌మెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని బీసీలు.. ఇప్పుడు గుర్తుకువచ్చారా బాబు అంటూ ఎద్దేవా చేశారు. అదీగాక అధికారంలో ఉన్నప్పుడు బీసీలపై ఇష్టారాజ్యంగా త‌ప్పుడు కేసుల‌ను బ‌నాయించార‌ని, అప్పుడు బీసీలు ఎందుకు గుర్తుకురాలేదని ఎదురు ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని వేల కోట్ల నిధుల‌ను కొట్టేసినప్పుడు గుర్తుకురాని బీసీలు.. స్కామ్‌లు చేసి అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఇప్పుడు గుర్తుకు వచ్చారా? అని ఎద్దేవా చేశారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.

Tags: ap minister anilkumar yadav, cm jagan, lokesh, tdp cheaf chadrababu