టాలీవుడ్ చుట్టూ తిరుగుతున్న ఖాన్లు, కపూర్లు..!

ఒకప్పుడు టాలీవుడ్ మార్కెట్ చాలా తక్కువ. సినిమా ఎంత సక్సెస్ అయినా వసూళ్లు మరీ పెద్దగా ఉండేవి కావు. ఆ తర్వాత ఓవర్సీస్ మార్కెట్ ఏర్పడిన తర్వాత కొంత మేర కలెక్షన్స్ పెరిగాయి. అయితే బాహుబలి తర్వాత తెలుగు సినిమా మార్కెట్ పరిధి విపరీతంగా పెరిగింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తెలుగు సినిమాలు సత్తా చాటుతూ భారీగా వసూళ్లు రాబడుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలను దేశవ్యాప్తంగా అందరూ ఆరాధించడం మొదలు పెట్టారు. ఇదేసమయంలో బాలీవుడ్ లో వరుసగా విడుదల అవుతున్న హిందీ సినిమాలు అక్కడ జనాలకు అంతగా ఎక్కడం లేదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలన్నీ బోల్తా పడుతున్నాయి.

హిందీ లో స్టార్ హీరోలు చేసే సినిమాలు దేశ వ్యాప్తంగా విడుదల అవుతాయి. అయితే అక్కడి స్టార్ హీరోలు తమ సినిమాల ప్రమోషన్స్ కేవలం ఉత్తరాది వరకు మాత్రమే చేసుకునేవారు. అడపా దడపా ఇతర రాష్ట్రాల్లో ప్రమోషన్స్ చేపట్టేవారు. అయితే ఇటీవల తెలుగు సినిమా మార్కెట్ విపరీతంగా పెరిగింది. ఒక్క తెలుగులోనే రూ. 200 కోట్ల వరకు వసూళ్లు సాధించవచ్చని ఇటీవల రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ నిరూపించింది. దీంతో తెలుగు సినిమా మార్కెట్ పై హిందీ హీరోల కన్ను పడింది.

ఉత్తరాదిలో తమ సినిమాలకు ప్రస్తుతం అంతంత మాత్రమే ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో తెలుగులో కాస్తయినా మార్కెట్ పెంచుకోవాలని అక్కడి హీరోలు భావిస్తున్నారు. ప్రస్తుతం హిందీ అగ్ర హీరోలు నటిస్తున్న ప్రతి సినిమా తెలుగులోకి డబ్ అవుతోంది. ఒకప్పుడు హైదరాబాద్ కు వచ్చి ప్రమోషన్స్ కూడా చేయని స్టార్ హీరోలు ఇప్పుడు వరుసగా హైదరాబాద్ కు క్యూ కడుతున్నారు. అంతిమ్ విడుదల సమయంలో సల్మాన్ ఖాన్, 83 రిలీజ్ టైంలో రణ్ వీర్ సింగ్, బ్రహ్మాస్త్రం ట్రైలర్ రిలీజ్ కోసం రణ్ బీర్ కపూర్ హైదరాబాద్ కు వచ్చి సందడి చేశారు. ప్రస్తుతం అమీర్ ఖాన్ వంతు వచ్చింది. ఆయన తాజాగా నటించిన చిత్రం లాల్ సింగ్ చడ్డా కోసం హైదరాబాద్ కు వరుసగా చక్కర్లు కొడుతున్నారు.

అమీర్ ఖాన్ ఇంతకుముందెప్పుడూ చేయని విధంగా ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రమోషన్స్ చేపడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి తో కలిసి వరుసగా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్ లకు హాజరవుతున్నారు. హీరో నాగార్జునకు కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. టాలీవుడ్ మార్కెట్ పెరగడంతో ఇక్కడ కూడా కలెక్షన్స్ సాధించేందుకోసమే అమీర్ వరుసగా ఎక్కడ ప్రమోషన్స్ చేపడుతున్నారు. అలాగే తెలుగు హీరోలు వరుసగా బాలీవుడ్ లో సత్తా చాటుతుండడంతో తాము కూడా తెలుగులో కలెక్షన్స్ సాధించి పరువు నిలబెట్టుకోవాలని బాలీవుడ్ స్టార్ హీరోలు భావిస్తున్నారు.

Tags: amir khan, bollywood news, chiranjeevi, naga chaiatanya, Salman Khan, tollywood news