చూశారా.. బొల్లాసార్.. ఇదీ ఆదుకోవడమంటే!! ఇదేదో రాజకీయ నేతలు , లేదా ప్రత్యర్థి పార్టీల నాయకు లు చెబుతున్న మాట కాదు. నియోజకవర్గం ప్రజల గుండెలోతుల్లోంచి వస్తున్న మాట. తమకు గతంలో అందిన సాయం.. ఇప్పుడు అందుతున్న సాయాలను బేరీజు వేసుకుని నియోజకవర్గం ప్రజలు ఎలాంటి పక్షపాతం లేకుండా చెబుతున్న మాట. ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం ప్రజలను కదిలిస్తే.. ఈ మాటే వినిపిస్తుండడం గమనార్హం.
ఆదపలో ఉన్నవారిని ఆదుకుంటామని.. నిరంతరం తాము అందుబాటులో ఉంటామని.. నాయకులు ఎన్నికల సమయంలో ప్రజలకు హామీ ఇవ్వడం రివాజే. దీనిని ఎవరూ తప్పుబట్టరు. అయితే.. గెలిచిన తర్వాత.. ఆయా నాయకులు చెప్ఇపన మాట ప్రకారం ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉన్నారనేది ప్రశ్న. ఇదే విషయాన్ని తాజాగా వినుకొండ నియోజకవర్గం ప్రజలను కదిలించినప్పుడు నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలు చెప్పుకొచ్చారు.
“ఏమాట కామాటే చెప్పుకోవాలి. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా.. గతంలో పనిచేసిన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాకు తోడుగా ఉన్నారు. ఆయన ఇంటికి కానీ.. ఆఫీసుకు కానీ వెళ్తే.. వెంటనే ఆయన పలకరించి.. మా సమస్య వినేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అసలు ఆఫీసుకు కూడా వెళ్లనిచ్చే పరిస్థితి లేదు. మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఉసూరు మంటున్నాం“ ఇదీ.. ఇప్పుడు వినుకొండ టాక్.
2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఇక్కడ బొల్లా బ్రహ్మనాయుడు విజయం దక్కించుకున్నారు. అనేక హామీలు గుప్పించారు. ముఖ్యంగా ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి రిలీఫ్ నిధి నుంచి నిధులు విడుదలయ్యేలా చేస్తానని కూడా చెప్పారు. దీనికి ఎమ్మెల్యే సిఫారసు చాలా ముఖ్యం. ఆపరేషన్లు చేయించుకున్నవారు.. ఆపదలో ఉన్నవారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే.. వినుకొండలో బాధితులు అసలు తమకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూపాయి కూడా రాలేదని.. కనీసం తమ బాధ చెప్పుకొనేందుకు ఎమ్మెల్యే కానీ, ఆయన ఏర్పాటు చేసిన వారు కానీ తమకు కనిపించడం లేదని చెబుతున్నారు.
గతంలో ఇలా..
గతంలో టీడీపీ సీనియర్ నాయకుడు, అప్పటి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రత్యేకంగా ఒక కార్యాలయం ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. వారు సమస్యలు చెప్పుకొనేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేశారు. ఆయన అవకాశం ఉంటే కలిసేవారు. లేకపోతే.. బాధలు చెప్పుకొనేందుకు వచ్చినవారి నుంచి ఈ యంత్రాంగం వివరాలు సేకరించేది. ఆ వెంటనే వారి పత్రాల ఆధారంగా సీఎం రిలీఫ్ పండ్ నుంచినిధులు విడుదల చేయించేవారు. దీంతో అందరికీ లబ్ధి చేకూరింది. ఇదే విషయాన్ని ఇక్కడి స్థానికులుచెప్పుకొని రావడం గమనార్హం. ఇదీ.. సేవలో తేడా బొల్లా సార్.. అంటున్నారు నియోజకవర్గం ప్రజలు.