బాలీవుడ్ లో బింబిసార దున్నేయడం ఖాయం.. ఎందుకంటే..!

కెరీర్లోనే తొలిసారిగా ఒక సోషియో ఫాంటసీ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. వశిష్ట్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగునాట అద్భుత విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. రూ.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమా ఇప్పటికే రూ. 30 కోట్లకు పైగా షేర్ సాధించింది. డిస్ట్రిబ్యూటర్లకు భారీగా లాభాలను తెచ్చిపెట్టింది. కాగా తెలుగులో ఇంతటి విజయం సాధించిన ఈ సినిమాను బాలీవుడ్ లోకి తీసుకెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయి.హిందీలోకి డబ్బింగ్ చేసి అక్కడ విడుదల చేయనున్నారు.

అయితే అక్కడ కూడా ఈ సినిమా సంచలన విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నార్త్ లో హిందీ సినిమాలు పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఎన్ని సినిమాలు విడుదలవుతున్నా, అందులో బడా హీరోలు ఉన్నా ప్రేక్షకులు తిరస్కరిస్తున్నారు. సౌత్ నుంచి వెళ్తున్న సినిమాలు మాత్రం అక్కడ మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. మంచి కథ, కథనం ఉన్న తెలుగు సినిమాలు నార్త్ ప్రేక్షకులకు బాగా నచ్చుతున్నాయి. అందులోనూ గ్రాండ్ గా తెరకెక్కే సినిమాలను, సోషియో ఫాంటసీ సినిమాలను బాలీవుడ్ ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు.

గతంలో బాహుబలి, బాహుబలి 2 సినిమాలు అక్కడ సంచలన విజయం సాధించాయి. మగధీర సినిమా గురించి కూడా అక్కడ తరచూ ప్రస్తావన వస్తూ ఉంటుంది. సోషియో ఫాంటసీ కథతో వచ్చిన బింబిసార కూడా నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఈ సినిమా సౌత్ లో, ఓవర్సీస్ లో మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో బాలీవుడ్ లో కూడా ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అక్కడ ఈ సినిమా విడుదల అయితే భారీ విజయం సాధించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags: Bimbisara, bimbisara movie, bollywood cinimas, nandhamuri kalyan ram, tollywood cinimas