నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరు కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు భారీ విజయం సాధించడంతో ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా షూటింగ్ కూడా యాక్షన్ సీన్‌తో మొదలైంది. ఈరోజు సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ పర్యవేక్షణలో యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతుంది.
ఇక ఈ సినిమాలో బాలయ్య డ్యుయల్ రోల్ పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అందులో ఓ పాత్రలో అఘోరాగా నటించబోతున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. ఆ పాత్రకు పెద్దగా డైలాగ్‌లు ఉండవట. ఆధ్యాత్మికతతో అఘోర పాత్ర చాల వైవిధ్యంగా అలాగే ప్రేరణాత్మకంగా ఉండబోతుందట. ఈ సినిమాలో హీరోయిన్ గా అంజలిని తీసుకున్నారు. అలాగే శ్రియా సరన్‌ను కూడా ఓ కీలక పాత్ర కోసం తీసుకోవాలని చిత్రబృందం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.