వచ్చే ఎన్నికలలో ఏపీలో అత్యంత ఆసక్తి రేపుతున్న నియోజకవర్గాల నియోజకవర్గాలలో కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గం ఒకటి. ఇక్కడ నుంచి గత ఎన్నికలలో టిడిపి తరఫున గెలిచిన వల్లభనేని వంశీ తర్వాత వైసీపీకి దగ్గరయ్యారు. వచ్చే ఎన్నికలలో గన్నవరం వైసిపి అభ్యర్థిని తానే అని.. తానే వైసీపీ నుంచి పోటీ చేస్తానని వంశీ పదేపదే ప్రకటించుకుంటున్నారు. వంశీ పార్టీ మారాక చంద్రబాబు లోకేష్ తో పాటు చివరకు చంద్రబాబు, భార్య నారా భువనేశ్వరి ప్రస్తావన సైతం తీసుకువచ్చి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణుల రక్తాన్ని సైతం మరిగించేలా చేశాయి.
వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఎలా ? కోరుకుంటున్నాయో అలాగే గుడివాడలో కొడాలి నాని, గన్నవరంలో వంశీ ఇద్దరు కూడా చిత్తుగా ఓడిపోవాలని కూడా అలాగే కోరుకుంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వీరిద్దరూ వచ్చే అసెంబ్లీలో ఉండకూడదు అని టిడిపి శ్రేణులు పంతంతో ఉన్నాయి. ఇక వచ్చే ఎన్నికలలో గన్నవరం టిడిపి అభ్యర్థి ఎవరు ? అవుతారు అన్నదానిపై కూడా రాజకీయ వర్గాలలో ఆసక్తి రేపుతుంది.
ఈ క్రమంలోనే అదిరిపోయే ట్విస్ట్ కూడా చోటు చేసుకుందని తెలుస్తోంది. గత ఎన్నికలలో వంశీపై వైసీపీ నుంచి పోటీ చేసి కేవలం ఎనిమిది వందల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు త్వరలోనే టిడిపిలోకి రాబోతున్నారని.. ఆయనే అక్కడ నుంచి వంశీపై టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తారని తెలుస్తోంది. యార్లగడ్డ టిడిపిలోకి వస్తే సామాజికంగా, రాజకీయంగా ఆర్థికంగా వంశీని ఢీకొట్టే…
యార్లగడ్డను తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఆమోదిస్తున్నాయి. వివాద రహితుడు కావడంతో పాటు సామాజికంగా, ఆర్థికంగా వంశీని ఢీకొట్టే బలమైన వ్యక్తి కావడంతో ఆయన అయితేనే సరైన అభ్యర్థి అవుతారని అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి.
ఇక వెంకట్రావు వైసీపీలో ఇమడ లేకపోతున్నారు. గత ఎన్నికలలో ఓడిపోయాక జగన్ ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం జరిగినా అది జరగలేదు. ఇక కృష్ణా జిల్లా డిసిసిబి చైర్మన్ పదవి ఇచ్చిన అది మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఈ క్రమంలోని వెంకటరావును తెలుగుదేశం పార్టీలోకి తీసుకువచ్చేందుకు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ శ్రేణులతో పాటు జిల్లాకు చెందిన కొందరు టిడిపి నేతలు చర్చలు జరుపుతున్నారని.. ఎన్నికలకు కాస్త ముందుగా వెంకటరావు టిడిపి ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. ఏది ఏమైనా వెంకట్రావు టిడిపి నుంచి పోటీ చేస్తే గన్నవరంలో వంశీకి ముచ్చెమటలు పట్టడం ఖాయం. ఇప్పటికే అక్కడ వ్యతిరేకతతో ఏటికి ఎదురీదుతున్న వంశీకి వెంకట్రావును ఢీ కొట్టి గెలవటం అంత సాధ్యం కాదు. ఏదేమైనా వెంకట్రావు పేరు టీడీపీ నుంచి వినిపిస్తుండడంతో గన్నవరం టీడీపీ కేడర్‌లో పూనకాలు లోడ్ అవుతున్నాయి.