కొండవీటి దొంగ.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఇది. హాలీవుడ్ రాబిన్ హుడ్ తరహాలో ఈ మూవీని రూపొందించారు. ఇందులో రాధ, విజయశాంతి హీరోయిన్లుగా నటించారు. శ్రీ విజయలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై టి. త్రివిక్రమరావు నిర్మించిన ఈ చిత్రానికి పరుచూరి సోదరులు కథ నందించగా, ఇళయరాజా స్వరాలు సమకూర్చారు.
1990 మార్చి 9న విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. సంచలనాలకు కేరాఫ్ గా మారింది. పరుచూరి సోదరులు హాలీవుడ్ లెవెల్లో ఆలోచించి కేవలం పది రోజుల్లోనే ఈ మూవీ కథను రెడీ చేశారు. యండమూరి వీరేంద్రనాధ్ స్క్రీన్ ప్లే సమకూర్చారు. కొండవీటి దొంగ టైటిల్ పెట్టారు. హీరోయిన్ గా శ్రీదేవిని సంప్రదించగా.. ఆమె కొండవీటి రాణిగా టైటిల్ మార్చాలని కండీషన్ పెట్టింది. కానీ, అందుకు మేకర్స్ ఒప్పుకోలేదు. కథలో కొన్ని మార్పులు చేసి విజయశాంతిని సెలక్ట్ చేసి, సెకండ్ హీరోయిన్ పాత్రను కూడా కల్పించి రాధను తీసుకున్నారు.
ఇక విలన్ గా అమ్రిష్ పురి ఎంపిక చేశారు. 1989నవంబర్ లో షూటింగ్ ప్రారంభం అయింది. 1990లో తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయగా.. రెండు భాషల్లోనూ అంచనాలకు మించి విజయాన్ని అందుకుంది. ఆనాటికి టాలీవుడ్ లో టెక్నికల్ గా ఉన్న హద్దులన్నీ చెరిపేస్తూ 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్ తో 70ఎమ్ఎమ్ లో డైరెక్ట్ గా రిలీజ్ అయిన తొలి సినిమా ఇది. అలాగే టాలీవుడ్ లో రూపొందిన టెక్నీకల్ వండర్స్ లో కొండవీటి దొంగ ఒకటిగా నిలిచిపోయింది.
ఇళయరాజా ఇచ్చిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఇప్పటికీ టాప్ క్లాస్ లో ఉంటాయి. అలాగే అప్పట్లోనే ఈ చిత్రం మొదటివారం రూ. 75 లక్షలు వసూలు చేసింది. అలాగే రూ.కోటి 25 లక్షల గ్రాస్ కేవలం మొదటి వారం లోనే రాబట్టిందీ సినిమా. వైజాగ్ లోని జగదాంబ థియేటర్ లో 4 ఆటలతో 100 రోజులు ఆడిన ఫస్ట్ మూవీ ఇదే. కాకినాడ ఆనంద్ థియేటర్ లో 107 రోజులు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దుమ్ము దులిపేసింది.