క‌ర్నూలుకు మూడు కార్యాల‌యాల త‌ర‌లింపు

మూడు రాజ‌ధానుల ఏర్పాటు అంశంపై ఏపీ వైసీపీ దూకుడుగా ముందుకు సాగుతున్న‌ది. ఆ దిశ‌గా చ‌క‌చ‌కా అడుగులు వేస్తున్న‌ది. ఇప్ప‌టికే అందుకు సంబంధించిన బి్ల్లుల‌ను అసెంబ్లీలో ఆమోదించింది. శాస‌న‌మండ‌లిలో ఆ ప్రిక్రియ‌కు బ్రేకులు ప‌డ్డాయి. దీంతో ఏకంగా మండ‌లిని ర‌ద్దు చేస్తూ తీర్మానం చేసి పార్ల‌మెంట్‌కు పంపింది. ఇదిలా సాగుతుండ‌గానే ఏపీ స‌ర్కారు తాజాగా మ‌రో నిర్ణ‌యం తీసుకుంది. వెలపూడిలోని మూడు కార్యాలయాలను కర్నూలు తరలిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. విజిలెన్స్ కమిషనర్ ఆఫీస్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఛైర్మన్, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ సభ్యుల కార్యాల‌యాల‌ను కర్నూలుకు తరలిస్తూ శుక్రవారం రాత్రి జీవో విడుద‌ల చేసింది. ప్రస్తుతం ఆయా కార్యాలయాలు గుంటూరు జిల్లా వెలగపూడిలోని తాత్కాలిక భవనాల్లో కొనసాగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఆ కార్యాలయాల తక్షణ త‌ర‌లింపు కోసం కర్నూలులో తగిన భవనాలను గుర్తించాలని ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజినీర్, కర్నూలు జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి.

అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా, కర్నూలును జ్యుడీషియల్ క్యాపిటల్‌గా ఏర్పాటు చేసే దిశగా జగన్ సర్కారు అడుగులేస్తోంది. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటీ, బీసీజీ రిపోర్టు ఇప్ప‌టికే సూచించిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైకోర్టుతోపాటు, దానికి సంబంధించిన కార్యాలయాలను కర్నూలుకు తరలించే ప్రక్రియలో ఏపీ స‌ర్కారు నిమ‌గ్న‌మైంది. అందులో భాగంగానే జగన్ సర్కారు ఆ మూడు ఆఫీసులను కర్నూలుకు తరలిస్తోందని రాజ‌కీయ వ‌ర్గాలు, అధికారులు భావిస్తున్నారు.

Tags: AP Govt, gs rao comitee, kurnool hogh court, three capital