దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన పశు వైద్యురాలు దిశా అత్యాచారం, హత్య ఘటన ఉదంతంతో ఏపీ ప్రభుత్వం మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలను చేపట్టింది. నేరస్తులకు 21 రోజుల్లోనే శిక్ష విధించేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. అదే విధంగా జిల్లాకో దిశా పోలీస్ స్టేషన్‌ను, న్యాయస్థానాన్ని ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే రాజమండ్రిలో తొలి ఠాణాను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా దిశ చట్టాన్ని పోలీసులు అమలు చేయడాన్ని ప్రారంభించారు. ఇటీవలే ఓ మహిళాఉద్యోగిని బస్సులో వేధింపులకు గురి చేసిన ఒకరిని పోలీసులు అరెస్టు చేసి దిశ చట్టం కింద మొదటి కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. తాజా మరో కేసు కూడా ఏలూరులోనే నమోదయింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..
ఏపీ రాష్ర్టం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఓ యువతి స్థానికంగా ఒక షాపులో విధులను నిర్వర్తిస్తున్నది. రోజువారీగా శనివారం అర్ధరాత్రి 11 గంటల సమయంలో విధులను ముగించుకుని బస్సు దిగి ఇంటికి వెళ్తున్నది. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న సదరు యువతిని ఓ యువకుడు వెంబడిస్తూ అసభ్య పదజాలంతో వేధించడం మొదలు పెట్టాడు. పక్కకు లాగి లైంగిక దాడికి యత్నించాడు. ఊహించని ఈ సంఘటనతో భయపడిపోయిన యువతి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడారు. ఆ కామాంధుడిని పట్టుకున్నారు. అనంతరం బాధితురాలు వెంటనే డయల్ 112కి ఫోన్ సమాచారం ఇవ్వడంతో పోలీసులు క్షణాల్లోనే అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపలోకి తీసుకున్నారు. దిశ చట్టం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు.