ఆర్థికంగా గడ్డుకాలం కొనసాగుతున్నా.. ఆదాయం అంతగా లేకున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటున్నారు. ధైర్యంతో ముందడుగు వేస్తూ ఒక్కో హామీని నెరవేరస్తున్నారు. ఇటీవలే విజయనగరం కేంద్రంగా జగనన్న దీవెన పేరుతో కొత్త సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టారు. ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులకు అవసరాల నిమిత్తం ఏటా రూ.20 వేల ఆర్థిక సాయాన్న అందించడం ఆ పథకం ఉద్దేశం. తాజాగా ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని దానిని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకీ ఆ పథకం ఏమిటంటే..
గుంటూరు, విజయవాడలోని సుమారు 25లక్షల మంది పేదలకు ఉగాది రోజున ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ఆ దిశగా ఏపీ సర్కారు అడుగులు వేస్తున్నది. అమరావతిలో ఉన్న స్థలాలు గుంటూరు జిల్లాతో పాటూ విజయవాడవాసులకు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. అందుకు సంబంధించి జీవో కూడా ఇప్పటికే జారీ చేసింది. అందులో భాగంగా అమరావతి పరిధిలో సేకరించిన భూముల వివరాలను విడుదల చేసింది. ఇప్పుడు తాజాగా ఆ స్థలాల్లో మొత్తంగా 54,307మంది లబ్ధిదారులకు 1251.5 ఎకరాలు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అమరావతిలో ఐనవోలు, కురగల్లు, నవులూరు, కృష్ణాయపాలెం, నిడమర్రు, మందడంలో భూములను పేదలకు ఇవ్వనుండడం గమనార్హం.