పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఏపీ సీఎం జగన్ మూడు రాజధానుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయపాలనకు రాజధానిగా, విశాఖను కార్యనిర్వహణకు రాజధానిగా చేయాలని భావించారు. ఒకవైపు మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, CRDA రద్దు బిల్లులపై సందిగ్ధత నెలకొన్నది. ఏం జరుగుతుందా? అన్న సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే మరోవైపు వచ్చే బడ్జెట్ సమావేశాల్లో వాటిని ఆమోదం పొందేలా చేసుకోవడమేగాక, ఉగాది నాటికి కార్యాలయాలను తరలించేందుకు జగన్ సర్కారు చకచకా అడుగులు వేస్తున్నది. ఒక్కో కార్యాలయాన్ని తరలించేందుకు అంతా సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే విజిలెన్స్ కమిషనర్‌తో పాటు పలు న్యాయశాఖ అనుబంధ కార్యాలయాలను కర్నూలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేసింఇ. ఈ మేరకు జీవో 13ను కూడా జారీ చేసిన విషయం తెలిసిందే.
తాజాగా ఏపీ సర్కారు మరో నిర్ణయాన్ని తీసుకుంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం నుంచీ పారిపాలన సాగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆ దిశగా ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నది. అయితే ఆ ప్రక్రియ ఎలా సాగించాలి అనే అంశాలపై తీవ్రంగా కసరత్తును ప్రారంభించినట్లు ప్రభుత్వ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రధానంగా విశాఖకు సెక్రటేరియట్, సీఎం క్యాంప్ ఆఫీస్, రాజ్‌భవన్త రలిపోనున్నాయి. దీంతో ఉగాది నుంచీ సీఏం జగన్ మకాం విశాఖకు మారనుంది. ఈ నేపథ్యంలో అందుకు కావాల్సిన భవనాలను అన్వేషించే పనిలో అధికారులు నిమగ్నమైనట్లు తెలుస్తున్నది. ఇప్పటికే రుషికొడ ఐటీ సెజ్‌లోని మిలీనియం టవర్లలో సెక్రటేరియట్, సీఎం ఆఫీస్ను ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మిగతా శాఖల ఏర్పాటుకు అనువైన భవనాలను ఎంపిక ప్రక్రియను ఆయా శాఖల అధికారులే చేపట్టినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతానికి వుడా భవనం, నీటిపారుదల శాఖ ఆఫీస్, ఏయూలోని గోల్డెన్ జుబ్లీ గెస్ట్ హౌస్, పోర్టు గెస్టు హౌస్, స్టార్టప్ విలేజ్‌లోని భవనాల్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జిల్లా కార్యాలయాల్లోనే శాఖల కార్యాలయాలను ఏర్పాటు చేసే ఆలోచనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఏమి జరుగుతుందా? అని సర్వాత్రా ఆసక్తి నెలకొంది.