జ‌గ‌న్ నిర్ణ‌యానికి కేంద్రం ప‌చ్చ‌జెండా !

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీసుకున్న నిర్ణ‌యానికి కేంద్రంలోని బీజేపీ మ‌ద్ద‌తు ల‌భించేలానే ఉంది. ఏపీ ప్ర‌భుత్వం ఆమోదించిన శాస‌న‌మండ‌లి బిల్లు ర‌ద్దుకు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ప‌డేలా తెలుస్తున్న‌ది. బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు వెల్ల‌డించిన అంశాల ప్ర‌కారం అదే నిజ‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. శాసన మండలిని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానం అంశంపై విలేక‌రుల అడిగిన ప్ర‌శ్న‌ల‌పై ఆయ‌న స్పందించారు. ఈ సంద‌ర్భంగా న‌ర‌సింహారావు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి రద్దుపై కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తుందని ఉద్ఘాటించారు. బిల్లుకు కేంద్రం అడ్డు చెప్పే అవకాశం లేదని స‌మాధాన‌మిచ్చారు. పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ సూచనల మాత్రమే చేస్తుందని, వాటిపై అంతిమ నిర్ణయం పార్లమెంట్‌దేన‌ని స్ప‌ష్టం చేశారు. మండలి రద్దు బిల్లును ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసే ఆలోచన కేంద్రానికి లేదని ఆయన తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఇక శాస‌న మండలి రద్దు అంశాన్ని కేంద్రం రాజకీయ కోణంలో చూడడం లేదని, తెలిప‌డం విశేషం. బిల్లును ఆలస్యం చేయడం, తొందరగా పూర్తి చేయడం ఉండవ‌ని, రాజ్యాంగ వ్యవస్థల‌కు లోబడే నిర్ణయాలు ఉంటాయని తెల‌ప‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. కొందరు కావాలనే కేంద్రంపై బుర‌ద‌జ‌ల్లు తున్నార‌ని, తమ పార్టీకి మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? అని చూడట్లేదని.. రాజ్యాంగం ప్రకారమే కేంద్రం అడుగులు వేస్తుందని ఆయన స్ప‌ష్టం చేశారు. అదే కేంద్రం నిర్ణ‌య‌మైతే ఏపీ స‌ర్కార్ బిల్లుకు పార్ల‌మెంట్లో ఆమోద ముద్ర ప‌డిన‌ట్లేన‌ని రాజ‌కీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags: ap cm jagan, central givt, council resulution, gvl narasimharao