3రాజ‌ధానులపై క‌మిటీ చైర్మ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేయాల‌ని నివేదిక‌న అంద‌జేసిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జీఎన్‌ రావు మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాము అంద‌జేసిన నివేదికపై పత్రికల్లో వివిధ ర‌కాలుగా వార్తలను వ‌స్తున్నాయ‌ని ఆక్షేపించారు. విశాఖపట్నమే పరిపాలనా రాజధానిగా ఉండాలని తాము స్పష్టంగా చెప్పామ‌ని ఉద్ఘాటించారు. హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో బుధ‌వారం నిర్వ‌హించిన స‌మావేశంలో జీఎన్‌ రావు పాల్గొని ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి 13 జిల్లాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ప్రభుత్వానికి నివేదిక అందించామ‌ని స్ప‌ష్టం చేశారు. 13 జిల్లాలను 4 జోన్లుగా ఏర్పాటు చేయాలని తాము స్ప‌ష్టంగా సూచించామ‌ని తెలిపారు. తమ నివేదికపై తప్పుడు వార్తలను ప్రసారం చేయడాన్ని ఖండించారు. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌గా పెట్టొద్దని తాము చెప్పలేదని స్ప‌ష్టం చేశారు.

అదీగాక కమిటీ సభ్యులు ప్ర‌లోభాలకు గుర‌య్యార‌న‌డం అవాస్తవమని, కమిటీలో అంత‌టి సాదాసీదా వ్య‌క్తులు లేర‌ని, 40 ఏళ్ల అనుభవ‌జ్ఞులు ఉన్నారని జీఎన్ రావు తెలిపారు. మూడు, నాలుగు నెలలు శ్ర‌మించి రూపొందించిన నివేదికను తగులబెట్టడంపై విచారం వ్య‌క్తం చేశారు. వైజాగ్‌తో పాటు విజయవాడ, మచిలీపట్నం ప్రాంతాలకు సంబంధిచిన లాభనష్టాల పైనా చర్చించామని, విశాఖలో ఎటువైపు రాజధాని పెట్టుకోవచ్చో అనే అంశాన్ని కూడా త‌మ రిపోర్టులో స్పష్టంగా సూచించామ‌ని వెల్ల‌డించారు.

పరిపాలనా రాజధానిగా విశాఖపట్న‌మే బెస్ట్‌ ఆప్షన్‌ అని పునరుద్ఘాటించారు. మూడు ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి జరగాలనే.. మూడు ప్రాంతాల్లో రాజధానులు సూచించినట్లు వివ‌రించారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం 4 స్థానిక కమిషనరేట్లు ఏర్పాటు చేయాలని, కర్నూలులో హైకోర్టు పెడితే నాలుగు జిరాక్స్‌ సెంటర్లు మాత్రమే వస్తాయనడం చాలా తప్పని, హైకోర్టుతో ట్రిబ్యునల్స్‌ కూడా ఏర్పడతాయని, అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్నాకే నివేదిక ఇచ్చినట్లు పేర్కొన్నారు.

Tags: ap capital amaravathi, gs rao comitee, vishakapatnam