ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ కు వరంగా మారిందని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత చాలామంది ఆంధ్రప్రాంతానికి చెందినవారు హైదరాబాద్ ని వదులుకోవటానికి ఇష్టపడలేదు ఎందుకంటే ఆస్థాయి నగరం ఆంధ్రప్రదేశ్ లో మరెక్కడా లేదు. అందుకనే తమకు కూడా హైదరాబాద్ స్థాయి నగరం కావాలనుకున్నారు. అందుకే గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు దానిగురించి గొప్పగానే కలకన్నారు. చాలామంది ఆంధ్రప్రాంతానికి చెందినవారు వారి భవిష్యత్తు అక్కడే వుండబోతుందనే నమ్మకంతో అక్కడ స్థలాలు కూడా కొనుక్కున్నారు. ఎందుకంటే అప్పటి పరిస్థితి ప్రకారం చూస్తే హైదరాబాద్ లో మారుమూల వున్న రేట్లు అమరావతి నడిబొడ్డులో వున్నాయి కాబట్టి భవిష్యత్తులో మంచి ప్రయోజనం వస్తుందనే ఆలోచనతో అక్కడ కొనుగోళ్లు చేసారు.
కానీ ఇప్పుడు తాజాపరిణామాలను బట్టి చూస్తుంటే ఆంధ్రులు కలకన్న రాజధాని కలగానే మిగిలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమ కష్టార్జితం అంతా తమ సొంత రాజధాని లో పెట్టుకుని ఇప్పుడు ఏంచేయాలో తెలియని పరిస్థితిలో సగటు ఆంధ్రా వాసి వుండిపోయాడు.
రాజకీయాలను పక్కనపెట్టి ఆలోచిస్తే సగటు మనిషి ఎవరైనా తమ కష్టార్జితాన్ని కూడబెట్టి భవిష్యత్తు తరంకోసం స్థలాలు, పొలాల రూపంలో కొనుక్కుంటారు. ఎందుకంటే పిల్లలు పెరిగే సమయానికి కనీసం రూపాయి రెండు రూపాయలు అవుతాయనే నమ్మకంతో. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే రూపాయి పావలా అయిపోయినట్టు కనిపిస్తుంది. మనప్రమేయం లేకుండా కష్టార్జితం కళ్ళముందే కరిగిపోతుంటే భవిష్యత్తు పైన భరోసా ఎలా ఉంటుంది?
ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలపైన నమ్మకం కూడా పోతుంది.
వాస్తవానికి రాష్ట్రాలకు రాజధాని అనేది చాలా కీలకం,ఎందుకంటే పరిపాలన అంతా ఒక చోట నుంచి జరగాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే రాష్ట్రంలోకి పెట్టుబడులు ఆహ్వానించాల్సిన తరుణం ఇది. పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్లకు అన్ని రకాలుగా ప్రభుత్వం సహకరించాలి. విజయవాడ ఆర్ధిక రాజధానిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. అంతేకాకుండా పక్కనే గుంటూరు లాంటి అభివృద్ధి చెందిన నగరం కూడా వుంది. ఈ రెండు నగరాలను కలుపుకుంటూ అమరావతిలో అభివృద్ధి జరగటం చాల సులువవుతుంది.
జగన్ చేసిన ప్రకటన అనేది భవిష్యత్తుని ఆలోచించి మంచా చెడా అనేది పక్కన పెడితే… ఇప్పుడు మాత్రం అది మంచిది కాదు
చిన్న చిన్న కంపెనీలు… అంటే తక్కువ పెట్టుబడితో వెంటనే శాఖలను మొదలుపెట్టేవి ఇలాంటి ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికి చూస్తాయి. కాని జగన్ ప్రకటనతో వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తారు. రాష్ట్రం ఒక గాడిన పడిన తర్వాత విభజించాలి అనే ఆలోచన మంచిదే. ఇప్పుడు జగన్ పుణ్యమా అని హైదరాబాద్ లో తగ్గిన భూముల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. చిన్న చిన్న స్థలాలు కొనే వాళ్ళు కూడా హైదరాబాద్ వైపే చూస్తున్నారు.
జగన్ ఆలోచనతో ఆంధ్రాలో భూముల ధరలు భారీగా తగ్గుతున్నాయి అనేది విశ్లేషకుల అభిప్రాయం. అవి పెరిగే అవకాశం కూడా ఇప్పట్లో పెద్దగా కనపడటం లేదు. కాబట్టి హైదరాబాద్ వైపు చూసే వాళ్ళ సంఖ్య కూడా క్రమంగా పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినపడుతున్నాయి.ఆంధ్ర ప్రదేశ్లో తాజా పరిస్థితులు చూస్తుంటే ఇతర రాష్ట్రాల్లో ,దేశాలలో నివసిస్తున్న ఆంధ్రులు కూడా భవిష్యత్లో పెట్టుబడులు పెట్టడం కష్టం , ఇక ఇతర రాష్ట్రం వాళ్ళు కి నమ్మకం ఎవరు కలిపిస్తారు , ఆంధ్ర అభివృద్ధి పై భరోసా ఎవరు ఇస్తారు . ఈ కుల రాజకీయ క్రీడలో చివరకి సమిధలు అయ్యేది మాత్రం ఆంధ్రులే .