అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డలు .. మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!

నటీనటులు: అజ్మల్, ఆలీ, బ్రహ్మానందం, కత్తి మహేష్ స్వ‌ప్న, ధన్ రాజ్ తదితరులు

సంగీతం: రవిశంకర్

ఛాయాగ్రహణం: జగదీష్ చీకటి

రచన: రామ్ గోపాల్ వర్మ/కరుణ్ వెంకట్

నిర్మాత: అజయ్ మైసూర్

దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ/సిద్దార్థ తాతోలు

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన చిత్రం అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డలు . అ చిత్రంను క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప రెడ్లుగా తెర‌కెక్కించిన వ‌ర్మ దీన్ని అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డలు అని మార్చారు. ఈ చిత్రం ఏపీలో నెల‌కొన్న రాజ‌కీయాల‌ను, అక్క‌డి పరిస్థితుల‌ను త‌న‌దైన శైలీలో తెర‌కెక్కించారు. అయితే ఏపీలో ఈ సినిమా అనేక వివాదాల‌తో, సెన్సార్ స‌మ‌స్య‌ల‌తో, కోర్టు కేసుల‌తో ఎట్ట‌కేల‌కు ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. రామ్‌గోపాల్ వ‌ర్మ తో పాటుగా త‌న శిష్యుడు సిద్ధార్థ తాతోలు ఇద్ద‌రు క‌లిసి ఈ సినిమాను ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించారు. ఈ సినిమా విశేషాలు ఏమీటి.. ప్రేక్ష‌కుల‌ను ఎలా మెప్పిస్తుందో ఓసారి రివ్యూ చేసుకుందాం.

కథ: ఏపీలో వెలుగుదేశం అనే పార్టీ అధికారంలో ఉంటుంది. ఏపీలో అధికారం చెలాయించిన వెలుగుదేశం పార్టీ అనూహ్యంగా ఎన్నిక‌ల్లో ఓడిపోతుంది. బాబు సీఎంగా ఓడిపోవ‌డంతో.. కొత్త‌గా జ‌గ‌న్నాథ‌రెడ్డి సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేస్తాడు. అధికారం పోయిన ప్ర‌స్టేష‌న్‌లో ఉన్న బాబు కొత్త ప్ర‌భుత్వంపై నిత్యం విమ‌ర్శ‌లు చేస్తూ.. ప్ర‌భుత్వం చేప‌డుతున్న సంక్షేమ ప‌థ‌కాల‌కు అడ్డంకులు క‌లిగిస్తుంటాడు. ప్ర‌తిప‌క్ష నేత‌గా బాబు సీఎంను త‌న అనుయాయుల చేత విమ‌ర్శ‌లు చేస్తూ సీఎం పీఠం ఎప్పుడు ఎక్కుదామా అని ఆలోచిస్తుంటాడు. అయితే ఈ క్ర‌మంలోనే అనేక కుట్ర‌లు కుతంత్రాలు ప‌న్నుతూ ఏపీలో రాజ‌కీయ అనిశ్చితికి, ఆశాంతికి పాల్ప‌డుతుంటాడు. ఇదే క్ర‌మంలో బాబుకు అత్యంత అత్మీయుడు హ‌త్య‌కు గుర‌వుతాడు.. దీన్ని ఆస‌రా చేసుకుని ఏపీలో ఆశాంతి సృష్టించ‌డంతో సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం, ఉప ఎన్నిక‌లు రావ‌డం జ‌రుగుతుంది. త‌రువాత ఏమీ జ‌రిగింది అనేది తెర‌మీద చూడాల్సిందే.

క‌థ‌నం :  సంచ‌ల‌న  దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన‌ప్ప‌టికి సినిమాను అనుకున్నంత‌గా తీయ‌లేక‌పోయాడు. వ‌ర్మ త‌న శిష్యుడితో ఈ సినిమాను తెర‌కెక్కించిన‌ప్ప‌టికి సినిమాను ఎందుకు తీసాడో ఎవ్వ‌రికి అంతు చిక్కకుండా ఉంది. స‌మాజంలో జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌లు తీసుకుని తీస్తున్న సినిమాలు ఇవి అయిన‌ప్ప‌టికి ప్రేక్ష‌కుల‌కు ఇది అంత‌గా ఆక‌ట్టుకునేలా మ‌ల‌చ‌లేక పోతున్నాడు. అయితే ఎంతో మంచి క‌థ ఉన్న ఈ సినిమాను ప‌త‌నం చేసి త‌న ఇమేజ్‌ను తానే పాడు చేసుకున్నాడు. చంద్రబాబు బదులు బాబు.. జగన్మోహన్ రెడ్డి బదులు జగన్నాథ రెడ్డి.. దేవినేని ఉమ బదులు దైనేని రమ.. ఇలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన నేతల్నే ప్రధాన పాత్రల్లో పేర్లు మార్చి చూపిస్తూ.. అర్థం పర్థం లేని కథా కథనాలతో.. సిల్లీ జోకులు.. సెటైర్లు.. పేరడీలతో ప్రేక్షకులు ఆక‌ట్టుకోలేక పోయాడు. సినిమాలో అసెంబ్లీలో జ‌రిగే దృష్యాల‌ను, ప్ర‌తిప‌క్ష నేత న‌ట‌న‌, ఇక ఏపీలోని రాజ‌కీయ నేత‌ల తీరును త‌న పాత్ర‌ల‌ను ఆక‌ట్టుకునేలా మ‌లిచినా.. ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యెలా చేయ‌లేదు. సాంకేతిక విలువ‌లు ఏమాత్రం పాటించ‌లేదు అనిపించింది. నారా లోకేష్ ను లక్ష్యంగా చేసుకుని తీసిన పప్పు పాట.. లాంటివి అతడి వ్యతిరేకులకు నవ్వు తెప్పించవచ్చు. కేఏ పాల్ ను ఇమిటేట్ చేస్తూ సాగిన విన్యాసాలు కొందరికి కామెడీగా అనిపించింది.

నటీనటులు:  అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు సినిమాలో పాత్ర‌లు కేవ‌లం నిమిత్త మాత్ర‌మే. సినిమా అంతా వ‌ర్మ‌దే.  కేవలం నిజ జీవిత పాత్రల్ని అనుకరించడం మినహా ఎవ్వరూ ఏమీ చేసింది లేదు. ఏపీ రాజ‌కీయ నాయ‌కులైన‌ నారా లోకేష్.. పవన్ కళ్యాణ్.. కేఏ పాల్ పాత్రల్లో కనిపించిన నటులు త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. రంగం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌మైన  అజ్మల్ లాంటి కాస్త పేరున్న నటుడు ఇంత నాన్ సీరియస్ సినిమాలో జగన్ పాత్రలో సరిపోయాడు. చంద్రబాబు పాత్రలో కనిపించిన నటుడు లుక్ పరంగా ఓకే అనిపించాడు కానీ.. అంతకుమించి ఏమీ చేయలేదు. ఆలీ బ్రహ్మానందంలు త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం:  రామ్ గోపాల్ వ‌ర్మ కేవ‌లం సినిమా తీస్తున్నాడా అంటే తీస్తున్నాడు.. కేవ‌లం ప‌బ్లిసిటీ కోసం త‌ప్పితే.. స‌మాజంకు అక్క‌ర‌కు వ‌చ్చేలా.. ప్రేక్ష‌కుల‌ను సినిమా థియోట‌ర్ వ‌ర‌కు కూడా ర‌ప్పించే సాంకేతిక విలువ‌లు పాటించ‌లేదు. ఈ సినిమా ఇప్పుడే కేరీర్ ప్రారంభించే ఓ కొత్త ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన‌ట్లుగా ఉంది. సినిమా ఆసాంతం సాంకేతిక స‌మ‌స్య‌ల‌తోనే స‌త‌మ‌త‌మ‌యింది త‌ప్పితే ఎక్క‌డ సాంకేతిక‌త ప‌రంగా బెట‌ర్ అని చెప్పెలా లేదు. ఈ సినిమాతో అస‌లు టెక్నిషిన్లకు విలువ‌ల లేకుండా చేశాడు అని చెప్ప‌వ‌చ్చు. సంగీతం కూడా ఎబ్బెట్టుగా ఉంది. ఇక ఛాయ‌గ్రాహ‌ణం కూడా అంత‌గా ఆక‌ట్టుకునేలా ఏమీ లేదు. ఏదేమైనా సినిమా క‌థ‌తో పాటుగా, సాంకేతిక విలువ‌లు కూడా దారుణంగా దెబ్బ‌తిన్నాయి.

చివ‌రిగా :  అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు.. అనాథ‌లుగా మారిపోయారు.. వ‌ర్మ క‌డ‌ప బిడ్డ‌ల‌ను దిక్కులేని విధంగా త‌యారు చేశారు.

రేటింగ్-1.0/5

Tags: AmmaRajyamloKadapaBiddalu, RamGopalVarma, review, Siddharth Thatholu