ఓడ ఎక్కేదాక ఓడ మల్లన్న. ఓడ ఎక్కిన తరువాత బోడి మల్లన్న. అంతే ఎవరైనా అలాగే తయారయ్యారు. ఇప్పడు ఆ జాబితాలో కేజ్రీవాల్ సైతం చేరిపోయారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు మండిపతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. వరుసగా మూడోసారి రికార్డు స్థాయి మెజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకుని సంచలనం సృష్టించారు ఆమాద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడోసారి రేపు(ఆదివారం) రాంలీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల్లో గెలిచిన ఏడుగురు సిట్టింగ్ మంత్రులకు తిరిగి తన కొత్త కేబినెట్‌లో చోటు కల్పించాలని కేజ్రీవాల్ ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పడంతా ఆ నిర్ణయంపైనే చర్చ జరుగుతున్నది. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎందుకంటే.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించడంలో మహిళలు కీలక పాత్ర పోషించారు. ఎన్నికల ప్రచారంలోనూ ఆప్ నేతలు మహిళా సంబంధింత అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. రక్షణ, మహిళలకు ఉచిత బస్ పాస్‌లు కల్పిస్తామన్న హామీలను గుప్పించారు. అదీగాక ఆప్‌కి ఓటు వేయడమే కాదు…ఇంట్లో మగాళ్లను కూడా ఆప్‌కు ఓటువేసేలా ఒప్పంచాలని ఏకంగా కేజ్రీవాల్ పిలుపునివ్వడం, ఆ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడడం తెలిసిందే. ప్రచారంలో అంతగా ప్రాధాన్యతనిచ్చిన అరవింద్ తన కేబినెట్‌లో మహిళలు చోటు కల్పించకపోవడం గమనార్హం. మొత్తంగా 62 మంది ఏఏపీ ఎమ్మెల్యేల్లో 8 మంది మహిళలు ఉన్నారు. అయినప్పటికీ ఏ ఒక్కరికీ మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం శోచనీయం. దీనిపై మహిళా ఓటర్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగానూ ఏఏపీ నిర్ణయాన్ని తూర్పారబడుతున్నారు. ఒక్క మహిళకూ కేబినెట్‌లో చోటు కల్పించకపోవడం సరికాదంటు హితవుపలుకుతున్నారు. వారిని ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నలను గుప్పిస్తున్నారు. దీనిపై కేజ్రీవాల్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.