వివాదాల్లో చిక్కుకున్న రజనీ దర్భార్‌ సినిమా

ఇటీవలె విడుదలైన రజనీకాంత్‌ సినిమా దర్బార్‌ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే సినిమాలో రజినీకాంత్‌ చెప్పిన ఓ డైలాగ్‌పై అన్నాడీఎంకేలోని ఓ వర్గం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అది కొలివుడ్‌లో దుమారాన్ని రేపుతున్నది.  రజనీకాంత్‌ నటించిన, ప్రముఖ దర్శకుడు మురగదాస్‌ తెరకెక్కించిన దర్బార్‌ సినిమా ఇటీవలె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ వసూళ్లతో అన్ని ప్రాంతాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతున్నది. అదే సమయంలో ఈ సినిమాలోని కొన్ని జైలు సీన్లలో రజనీకాంత్‌ ఓ డైలాగ్‌ను పలికే సన్నివేశముంది. అందులో ” డబ్బుంటే జైలు నుంచి షాపింగ్‌ చేసి రావచ్చు” అని సంభాషణలున్నాయి. ఈ డైలాగ్‌పై కొలివుడ్‌లో తీవ్ర దుమారం చెలరేగింది. ఆ సంభాషణలు తమ నాయకురాలు శశికళను ఉద్దేశించి చెప్పినవేనని అన్నాడీఎంకేలోని ఓ వర్గం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అవి వినోదం కోసమే పెట్టినవేనని, ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో ఆ సంభాషణలను పెట్టలేదని సినిమా నిర్మాతలు వివరణ ఇచ్చుకున్నా ఆ నాయకులు శాంతించలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో సినిమా నుంచి సంభాషణ సీన్లను తొలగించారు. దీంతో ఆ వివాదం అక్కడితో సద్దుమణిగింది.

ఇదిలా ఉండగా తాజాగా మరిన్ని వివాదాలు దర్బార్‌ను చుట్టుముట్టాయి. సినిమాలో రజనీ డ్రస్సింగ్‌ స్టయిల్‌, తాను రౌడీనని చెప్పే మాటలపైనా పలువురు కేసులు పెట్టడడం గమనార్హం. అదీగాక ఓ పోలీసు ఆఫీసరు కేవలం నాలుగు రోజుల్లోనే ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడం వాస్తవానికి దూరంగా ఉందని ఏకంగా కొందరు పోలీసు ఉన్నతాధికారులే ఫిర్యాదు చేశారు. అదీగాక పోలీసు కమిషనర్‌ హిప్పీ జుత్తు, గడ్డంతో నటించడం ఏంటనీ, ఇది పోలీసు అధికారులను అవమానించడమేనని మాజీ రక్షణ దళాధికారి ఒకరు మరియ మైఖేల్‌ తూత్తుక్కుడి థర్డ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఓ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆ కేసు ఈనెల 21 విచారణకు రానుంది. భారీ వసూళ్లతో దూసుకుపోతున్న చిత్రానికి వివాదాలు చట్టుముడుతుండడంపై రజనీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని వివాదాల్లో చిక్కుకోవాల్సి వస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు.

Tags: darbar movie, diloug disputes, police case booked, rajanikanth