చింత‌ల‌పూడి టీడీపీ టిక్కెట్ రేసు ఫైన‌ల్స్‌లో ఉంది ఎవ‌రంటే…!

ఏలూరు జిల్లాలోని చింతలపూడి ఎస్సీ రిజర్వ్ అసెంబ్లీ సెగ్మెంట్ టిడిపికి ఎప్పుడు తలపోటుగా మారుతుంది. 2009 ఎన్నికల్లో చింతలపూడి ఎస్సీలకు రిజర్వ్ అయ్యాక తొలిసారిగా కర్రా రాజారావు పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన వైసీపీకి జంప్‌ చేయడంతో 2014 ఎన్నికల్లో డెల్టా ప్రాంతానికి చెందిన పీతల సుజాతను తీసుకువచ్చి సీటు ఇవ్వగా.. ఆమె గెలవటం మంత్రి అవ్వటం జరిగిపోయాయి. ఆ తర్వాత జరిగిన గ్రూపు రాజకీయాల నేపథ్యంలో సుజాత మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే సీటు కూడా కోల్పోయారు. విచిత్రం ఏంటంటే గత ఎన్నికల్లో 2009లో ఓడిన కర్ర రాజారావుకు సీటు ఇస్తే నియోజకవర్గం చరిత్రలోనే ఎప్పుడూ లేనంత ఘోరంగా 36వేల ఓట్ల తేడాతో పార్టీ ఓడిపోయింది.

అయితే రెండు సంవ‌త్ప‌రాల క్రితం రాజారావు మృతి చెందారు. దీంతో చింతలపూడి నియోజకవర్గానికి పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు కొత్త ఇన్చార్జిను నియమించలేదు. పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గం లో ఇన్చార్జంటూ ఎవరూ లేకపోవడంతో ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు గ్రూపులు కడుతున్నారు. ఇది రిజర్వ్ డ్ నియోజకవర్గ కావడంతో నియోజకవర్గంలోని రెండు పట్టణాలు… నాలుగు మండలాల్లో.. ఇతర సామాజిక వర్గాల నేతలు గ్రూపులుగా విడిపోయి.. తమకు కావలసిన ఎస్సీ నేతలను ఎంకరేజ్ చేస్తూ కాలం గడుపుతున్నారు. పార్టీ అధిష్టానం ఇప్పటికైనా చింతలపూడికి ఇన్చార్జిని నియమించకపోతే పార్టీకి ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం కనిపిస్తోంది.

ముఖ్యంగా సీటు కోసం ఆశిస్తున్న పదిమందికి పైగా నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీని ముందు నడిపిస్తూ ఏకతాటి మీదకు తీసుకువచ్చే నాయకుడే లేడు. ప్రస్తుతం చింతలపూడి టిడిపి టికెట్ రేసులో పది నుంచి 15 మంది పేర్లు ఉన్నాయి. అయితే వీరిలో చాలామంది తమ సొంత ఊళ్ళలో కనీసం వార్డ్ మెంబర్గా పోటీచేసి లేదా.. కౌన్సిలర్ గా గెలవలేని వాళ్ళు కూడా ఉన్నారంటే ఆశ్చర్య పోవాల్సిందే. ఎవరికి వారు నాలుగు ఫ్లెక్సీలు వేయించుకుని.. కొన్ని సాలువాలు, బొకేలు పట్టుకొని నియోజకవర్గంలో నాలుగు మండలాలు, రెండు పట్టణాలకు చెందిన నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారే తప్ప.. నిజంగా ప్రజల్లో ఉండే నాయకులు ఇద్దరు ముగ్గురు మించి లేరు.

కొంద‌రు ఏదో ఒక యాక్టివిటీ చేస్తున్నా ఎమ్మెల్యేగా పోటీ చేసే అంగ‌, ఆర్థిక బ‌లాలు లేని వారే. దీనిని బట్టి చింతలపూడి టిడిపి టికెట్ రేసులో పోటీ పడుతున్న వాళ్లు ఎంత సమర్థవంతమైన వారో అర్థమవుతుంది.
వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం గత మూడు సంవత్సరాల నుంచి ప్రధానంగా పోటీపడిన వారిలో మాజీ మంత్రి పీతల సుజాతతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ కొక్కిరిగడ్డ జయరాజు, రాష్ట్ర ఎస్సీ సెల్ విభాగంలో ఉన్న జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఆకుమర్తి రామారావు ఉన్నారు. వీరిలో సుజాత – జయరాజు ఇద్దరు నియోజకవర్గం కి నాన్ లోకల్. జ‌య‌రాజు గత 15 సంవత్సరాల నుంచి సీటు కోసం ప్రయత్నిస్తున్న ఆయన కల‌ నెరవేరటం లేదు.

సుజాతకు 2014లో మంచి ఛాన్స్ వచ్చినా.. 2019లో చివరకు సిటే దక్కలేదు. ఇక రామారావు 2014 – 2019 ఎన్నికల్లో టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేసిన ఆయన ఆశ నెరవేరలేదు. ఆకుమ‌ర్తి గ‌త ఆరేడేళ్లుగా పార్టీ త‌ర‌పున‌, అటు నారా లోకేష్ సేవా స‌మితి పేరుతో పార్టీ కేడ‌ర్‌కు, నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు సాయాలు చేస్తూ వ‌స్తున్నారు. ఇక గత మూడేళ్లుగా నియోజకవర్గ ప్రజలతో ఎంతో కొంత టచ్ లో ఉన్నది ఈ ముగ్గురు నేతలే. అయితే ఎన్నికలకు ఏడాది ముందు అనూహ్యంగా పరిణామాలు మారిపోతున్నాయి. ఇద్దరు ఎన్నారైలు టిడిపి టికెట్ కోసం రంగంలోకి దిగి శ‌రవేగంగా దూసుకుపోతున్నారు. వీరిలో లింగపాలెం మండలానికి చెందిన సొంగా రోషన్ కుమార్ మరో ఎన్నారై బొమ్మాజీ అనిల్ కుమార్ రేసులో ప్రధానంగా ఉన్నారు.

వీరిలో సొంగా రోష‌న్ కుమార్‌ది ఎస్సీ మాదిగ సామాజిక వ‌ర్గం కాగా.. అనిల్‌ది ఎస్సీ మాల సామాజిక వ‌ర్గం. ఇద్ద‌రూ ఎన్నారైలే. రోష‌న్‌కు లింగ‌పాలెం మండ‌లంలో కొంత ప‌ట్టు ఉంద‌ని అంటున్నారు. ఆ పార్టీ నాయ‌కులు కొంద‌రు స‌పోర్ట్ చేస్తున్నారు. ఇక మ‌రో ఎన్నారై అనిల్ విష‌యానికి వ‌స్తే ఆర్థికంగా స్ట్రాంగ్‌. గ‌తంలో ప‌శ్చిమ‌గోదావ‌రి క‌లెక్ట‌ర్‌గా ప‌నిచేసిన బి. దానం రెండో కుమారుడే అనిల్‌. అనిల్ సోద‌రుడు బిఎన్‌. విజ‌య్‌కుమార్ సంత‌నూత‌ల‌పాడు ఎమ్మెల్యేగా ప‌నిచేశారు. ప్ర‌స్తుతం అక్క‌డ టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉండి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ అక్క‌డే పోటీకి రెడీ అవుతున్నారు. ఫైనాన్షియ‌ల్ విష‌యంలో అనిల్ అధిష్టానంకు చెప్పిన ఫిగ‌ర్ సంతృప్తిగా ఉంద‌ని తెలిసింది.

 

దీనికి తోడు అటు సోద‌రుడి ద్వారా పార్టీలో కీల‌క నేత‌ల‌తో అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు. రీసెంట్‌గా సినీ నిర్మాత చ‌ల‌సాని అశ్వ‌నీద‌త్‌తో క‌లిసి మ‌రీ చంద్ర‌బాబును క‌ల‌వ‌డం కూడా ప్రాధాన్యత సంత‌రించుకుంది. పోటీ గ‌ట్టిగానే ఉన్నా పై స్థాయి నాయ‌కుల‌తో అధిష్టానంకు అనిల్ బాగా ద‌గ్గ‌ర‌వుతోన్న వాతావ‌ర‌ణం ఉంది. ఇటు రోష‌న్ స్థానికంగా ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ కొంద‌రు నాయ‌కుల‌కు, కేడ‌ర్‌కు ఆర్థిక‌, ఇత‌ర‌త్రా సాయాలు చేస్తూ వ‌స్తున్నారు. ఏదేమైనా చింత‌ల‌పూడి టీడీపీ టిక్కెట్ / ఇన్‌చార్జ్ ఎవ‌రిద‌న్న రేసు ఫైన‌ల్‌కు వ‌చ్చేసింది. దీనిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.

Tags: ap politics, intresting news, latest news, latest viral news, politics, social media, social media post, tdp, trendy news, viral news