సినిమాల్లోకి వచ్చిన తర్వాత చాలామంది తమ పేర్లను మార్చుకుంటారు. కాస్త అట్రాక్టివ్ గా లేదా కలిసొచ్చే పేరు పెట్టుకొని సినిమాల్లో రాణిస్తారు. చిరంజీవి, రజనీకాంత్ వంటి స్టార్ హీరోల అసలు పేర్లు కూడా వేరే! ఇక చాలా మంది హీరోయిన్లు తమ అసలు పేర్లను దాచిపెట్టి స్టేజి నేమ్స్ తో పాపులర్ అయ్యారు. చాలామందికి వారి పేరు ఏంటో కూడా తెలీదు. మరి ఈ ఆర్టికల్‌లో ఓసారి వారి పేర్లు ఏమిటో చూద్దామా.
శ్రీదేవి
అతిలోక సుందరి శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్. ఇండియన్ సినిమాల్లో ఫస్ట్ ఫిమేల్ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఈ అందాల తార తమిళనాడులోని మీనంపట్టిలో పుట్టింది. నాలుగేళ్ల వయసులోనే సినీరంగంలో అడుగుపెట్టింది. ఆ తర్వాత భారతీయ సినిమాల్లో ఎందరో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.
సౌందర్య
జూనియర్ సావిత్రిగా పేరు తెచ్చుకున్న సౌందర్య అసలు పేరు సౌమ్య. ఈ అందాల నటి బెంగళూరులో పుట్టి పెరిగింది. ఎంబీబీఎస్ ఫస్టియర్ పూర్తి చేశాక సినిమాలపై ఆసక్తితో ఇటువైపు వచ్చింది. ఈ అంతపురం హీరోయిన్ 32 ఏళ్ల వయసులోనే చనిపోయి సినీ లోకానికి తీరని లోటును మిగిల్చింది.
రోజా
ఆర్కే రోజా పేరు శ్రీలత రెడ్డి. రోజా సినీ రంగ ప్రవేశం చేసిన అనతి కాలంలోనే స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. ఇప్పుడు రాజకీయాల్లో రాణిస్తూ తన సత్తా చాటుతోంది.
రాశి
హాట్ యాక్ట్రెస్ రాశి పేరు విజయలక్ష్మి. పశ్చిమగోదావరి జిల్లాలో పుట్టిన రాశి ఐదేళ్ల వయసులోనే మమతల కోవెల సినిమా ద్వారా సినీ పరిశ్రమకు పరిచయం అయింది. శుభాకాంక్షలు, మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే చీర కట్టు అందాలతో ఎంతోమందిని కట్టిపడేసింది. ఇప్పుడు సీరియల్స్‌లో కూడా నటిస్తోంది.
జయసుధ
సహజనటి జయసుధ అసలు పేరు సుజాత నిడదవోలు. ఈ ముద్దుగుమ్మ చెన్నైలో పుట్టింది. సినిమాల్లో ఒక తల్లిగా, చెల్లిగా, భార్యగా, హీరోయిన్‌గా అద్భుతంగా నటించి ఎన్నో అవార్డులను గెలుచుకుంది.
ఆమని
శుభలగ్నం, శుభసంకల్పం, మిస్టర్ పెళ్ళాం సినిమాల్లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన ముద్దుగుమ్మ ఆమని. ఈ తార కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. జంబలకడిపంబ సినిమాతో సినీ తెరకు పరిచయమైన ఈ మాజీ హీరోయిన్ అసలు పేరు మంజుల.
జీవితా రాజశేఖర్
శ్రీశైలంలో పుట్టి పెరిగిన జీవితా రాజశేఖర్ అసలు పేరు పద్మ. చిన్నతనంలో జీవిత తన నుదిటిపై పెద్దగా బొట్టు పెట్టుకునేది. అందుకే ఆమెను పెద్ద బొట్టు పద్మగానూ పిలిచేవారు.