మరో నాలుగు మాసాల్లో ఎన్నికలు ఉన్నాయి. వైసీపీ నేతులు దూకుడుగా ఉండాలని, ప్రజలకు చేరువ కావాలని.. వారి సమస్యలు తెలుసుకుని.. ప్రభుత్వ పథకాలను వివరించాలని ఒకవైపు సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఏమాత్రం బాగోలేదని కొన్ని కొన్ని నియోజకవర్గాల నుంచి పార్టీకి సమాచారం చేరుతోంది. వీటిలో తొలి పేరు.. బాపట్ల నియోజకవర్గం అని తాడేపల్లి వర్గాలు అంటున్నాయి.
బాపట్ల నుంచి వరుసగా 2014, 2019 ఎన్నికల్లో కోన రఘుపతి వైసీపీ తరఫున విజయం దక్కించుకున్నారు. రెండో దఫా గెలిచిన నేపథ్యంలో వైసీపీ అధికారంలోకి రావడంతో డిప్యూటీ స్పీకర్‌గా రెండున్నరేళ్లు అవకాశం ఇచ్చారు. దీంతో ఆయన తొలి దశలో ప్రతిపక్షంలో ఉండగా.. ప్రజలకు చేరువ కాలేకపోయారు. కానీ, 2018లో మాత్రం విజయం దక్కించుకున్నారు. దీనికి కారణం.. టీడీపీ-జనసేనలు వేర్వేరుగా బరిలో నిలవడంతో ఓట్లు చీలి.. రఘుపతికి మేలు చేసింది.
అయితే.. ఇప్పుడు పరిస్థితి అలా కనిపించడం లేదని పరిశీలకులు చెబుతున్నారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరే కత ఉందని.. పైగా ప్రజలకు ఆయన కనిపించడం లేదనే టాక్ ముమ్మరంగా వినిపిస్తోంది. గడపగడపకు కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహించాలని సీఎం జగన్ పదే పదే చెప్పినా.. మమ అనిపిస్తున్నారనే టాక్ నియోజకవర్గంలో వినిపిస్తోంది. సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. పైగా.. బ్రాహ్మణ సామాజికవర్గానికి కూడా ఆయన చేసింది ఏమీ లేదనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం.
ఏదేమైనా.. ప్రజల మధ్య ఉండాల్సిన నాయకుడు.. ఇలా ఇంటికే పరిమితం కావడం, హైదరాబాద్ చుట్టూ గిరికీలు కొడుతుండడంతో ఇప్పుడు కోనకు సెగ బాగా పెరిగిందని సొంత పార్టీలోనే నాయకులు భావిస్తున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ సంయుక్తంగా బరిలో నిలుస్తుండడంతో ఈ దఫా ఓట్లు చీలే అవకాశం లేదు. దీంతో కోన గెలుపు అంత ఈజీ కాదని పరిశీలకులు చెబుతున్నారు. మరి ఇప్పటికైనా ఆయన ప్రజల మధ్య ఉంటారా? లేదా? చూడాలి.