తెలుగు మార్కెట్ పై తమిళ స్టార్ హీరో ఫోకస్..!

ఇప్పుడు తెలుగు హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ తమ సినిమాలను వివిధ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. కానీ బాహుబలికి ముందు వరకు తెలుగు సినిమాలకు తెలుగు రాష్ట్రాలతోపాటు, కర్ణాటక, ఓవర్సీస్ లలో మాత్రమే మార్కెట్ వుండేది. తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తెలుగు హీరోలకు అంత మార్కెట్ ఉండేది కాదు. కానీ కోలీవుడ్ హీరోలు మాత్రం తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా తమ సినిమాలను విడుదల చేస్తూ వస్తున్నారు. డబ్బింగ్ సినిమాలతోనే రజినీకాంత్, కమలహాసన్, సూర్య, కార్తీ, ధనుష్, విజయ్, విశాల్, విక్రమ్, శింబు వంటి హీరోలు టాలీవుడ్లో మార్కెట్ పెంచుకున్నారు.

ఇప్పుడు మరో తమిళ స్టార్ హీరో తెలుగు మార్కెట్ పై కన్నేశాడు. తమిళనాడులో ఉన్న యంగ్ హీరోల్లో శివ కార్తికేయన్ కు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే మిగతా తమిళ హీరోల్లాగా శివ కార్తికేయన్ టాలీవుడ్ పై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. అయితే ఆయన హీరోగా నటించిన రెమో సినిమా తొలిసారిగా తెలుగులో డబ్ అయింది. ఆ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించడంతో ఆ తర్వాత శివ కార్తికేయన్ దృష్టి టాలీవుడ్ పై పడింది.

శివ కార్తికేయన్ రెమో తర్వాత నటించిన డాక్టర్ సినిమా తెలుగులో వరుణ్ డాక్టర్ పేరుతో డబ్ అయి మంచి విజయాన్ని అందుకుంది. ఇటీవల ఆయన నటించిన డాన్ సినిమా తెలుగులోనూ మంచి వసూళ్లు సాధించింది. దీంతో శివ కార్తికేయన్ తెలుగులో మార్కెట్ పెంచుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. ప్రస్తుతం తెలుగులో కూడా నేరుగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో ఒక సినిమా మొదలు పెట్టాడు శివ కార్తికేయన్. అది సెట్స్ పై ఉండగానే మరో తెలుగు సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో శివ కార్తికేయన్ ఒక సినిమా చేసేందుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను కోలీవుడ్ అగ్ర నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మించనున్నారు. ఇక ఈ సినిమా కోసం శివకార్తికేయన్ ఏకంగా 20 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్న ట్లు ప్రచారం జరుగుతోంది. శివ కార్తికేయన్- అనుదీప్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ పూర్తి కాగానే కళ్యాణ్ కృష్ణ తో చేసే సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags: actor sivakarthikeyan, kollywood news, tollywood news