విలక్షణ నటుడు రానా దగ్గుబాటి. ఈ హీరో నటిస్తున్న చిత్రం విరాట పర్వం. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ రోజు రానా దగ్గుబాటి పుట్టిన రోజును పురస్కరించుకుని చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్‌లుక్ విడుదల చేయడంతో సినిమా పై నెలకొన్న నీలినీడలు వీడిపోయినట్లైంది. ఈ చిత్రం దాదాపుగా పట్టాలెక్కి ఐదు మాసాలు అవుతుంది. అయితే రానా అనారోగ్యంతో విదేశాలకు వెళ్ళడంతో చిత్ర షూటింగ్ అనుకున్న మేరకు ముందుకు సాగలేదు. అయితే ఇప్పుడు రానా ఆరోగ్యంగా తయారై.. మళ్ళీ ఫిట్‌నేస్ బాట పట్టడంతో పాటుగా, ఫస్ట్‌లుక్ విడుదల కావడంతో చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగబోతుందనే సంకేతాలు ఇచ్చింది చిత్ర యూనిట్.
ఇక ఈ ఫస్ట్‌లుక్‌లో రానా ముఖానికి ఎర్రటి క్లాత్ కట్టుకున్నాడు. వెనుక తుపాకులు జెండాలు పట్టుకొని పలువురు సైనికులు ఉరుకొస్తున్నారు. ఇక పోస్టర్‌పై విప్లవం అనేది ప్రేమతో కూడుకున్న చర్య అని రాసి ఉంది. తాజాగా విడుదలైన పోస్టర్ ఆకట్టుకుంటుంది. సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ మూవీలో ప్రముఖ నటి టబు కీలక పాత్రలో నటిస్తోంది. ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సాయిపల్లవి ఫిదా సినిమా తరువాత అనేక చిత్రాల్లో ఆకట్టుకునే నటనతో దూసుకుపోతుంది. ఈ చిత్రంలో నక్సలైట్‌గా నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని నాదీ నీది ఒకే కథ చిత్ర ఫేమ్ దర్శకుడు వేణు ఊడ్గుల తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను స్వయంగా నిర్మాత డి.సురేష్‌బాబు నిర్మిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలే నెలకొన్నాయి. రానా బాహుబలి సిరీస్ తరువాత దేశ వ్యాప్తంగా తన స్టామినాను పెంచుకున్నారు. ఇప్పుడు అనేక ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. త్వరలో విరాట పర్వం పూర్తి చేసి ఎంత తొందరగా అయితే అంత తొందరగా విడుదల చేసేందుకు దర్శకుడు వేణు ప్రయత్నాలు చేస్తున్నారు. రానా పుట్టిన రోజున విడుదల అయిన ఈ ఫస్ట్‌లుక్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతుంది.