బోస్ వ‌ర్సెస్ వేణు ఎక్క‌డ తేడా కొట్టింది… జ‌గ‌న్‌కు వాళ్లు దెబ్బేయ‌డం ప‌క్కా..!

తెగే దాకా లాగ‌డం మంచిది కాద‌నే టాక్ ఉంది. ఏ మాత్రం తేడా వ‌చ్చినా.. ప్ర‌త్య‌ర్థి పార్టీలు పుంజుకునేం దుకు దూకుడుగా ఉన్నాయి. పైగా కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యం. ఇలాంటి స‌మ‌యంలో కాపు సామాజిక వ‌ర్గం డామినేష‌న్ ఎక్కువ‌గా ఉన్న ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని రామ‌చంద్ర‌పురం నియోజ‌క‌వర్గం లో వైసీపీ రాజ‌కీయాలు హీటెక్కాయి. మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌, ప్ర‌స్తుత మంత్రి చెల్లుబోయి న వేణుల మ‌ధ్య కాక మ‌రింత వేడెక్కింది.

ఇద్ద‌రి మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో జ‌రుగుతున్న యుద్ధానికి కార‌ణం.. కేవ‌లం టికెట్ మాత్ర‌మే కార‌ణ‌మా? అనేది కూడా ఆస‌క్తిగా మారింది. గ‌త ఎన్నిక‌ల్లో రామ‌చంద్ర‌పురం నుంచి పోటీ చేయాల్సిన పిల్లి సుభాష్‌ను మండ పేట‌కు పంపించి, కాకినాడ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వేణును రామచంద్ర‌పురం తీసుకువ‌చ్చి.. టికెట్ ఇచ్చారు. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల స‌మ‌యం లోనే రామ‌చంద్ర‌పురం కోసం పిల్లి ప‌ట్టుబ‌ట్టారు.

కానీ, గెలుపు ముఖ్య‌మని, నియోజ‌క‌వ‌ర్గాలది అస‌లు స‌మ‌స్యే కాద‌ని చెప్పిన పార్టీ అధిష్టానం.. రామచంద్ర పురంలో తోట త్రిమూర్తులు(ప్ర‌స్తుత వైసీపీ నేత‌)ను ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా అప్ప‌ట్లో చెల్లుబోయిన‌ను కాకి నాడ నుంచి తీసుకువ‌చ్చి.. ఆయ‌న‌కు టికెట్ ఇచ్చింది. మండ‌పేట నుంచి బోసును రంగంలోకి దింపారు. చెల్లుబోయిన గెల‌వ‌గా, బోసు ప‌రాజ‌యం పాల‌య్యారు. తాను ఓడిపోవ‌డానికి కార‌ణం.. సొంత నియోజ‌క వ‌ర్గం నుంచి బ‌య‌ట‌కు పంపించ‌డ‌మేన‌ని బోసు భావిస్తున్నారు.

ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న నియోజ‌క‌వ‌ర్గం రామ‌చంద్ర‌పురంలోనే పోటీ చేస్తాన‌ని ఆయ‌న చెబుతు న్నారు. కానీ, పొరుగు నియోజ‌క‌వ‌ర్గం నుంచి తీసుకువ‌చ్చి..ఇక్క‌డ కూర్చోబెట్టారు. స్థానిక నాయ‌కుడిపై నేను విజ‌యం ద‌క్కించుకున్నాను కాబ‌ట్టి ఇక్క‌డ నేనే ఉంటాన‌నేది మంత్రి చెల్లుబోయిన వాద‌న‌. మొత్తంగా చూస్తే.. నియోజ‌క‌వ‌ర్గాల‌ను మార్చ‌డం.. నాయ‌కుల‌కు ఆశ‌లు క‌ల్పించ‌డం.. వంటి రెండు కార‌ణాలే ఇప్పుడు జ‌గ‌న్‌కు, వైసీపీ అధిష్టానానికి ఇబ్బందిగా మారాయి.

ఈ నేప‌థ్యంలో ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు రామ‌చంద్ర‌పురం ఇంచార్జిగా ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డిని రంగంలోకి దింపారు. అయితే.. ఆయ‌న ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా.. కీల‌క‌మైన శెట్టి బ‌లిజ సామాజిక వర్గంలో తేడా వ‌స్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏదేమైనా ఇప్పుడు అధిష్టానానికి ఈ సీటును గెలుచుకోవ‌డం.. నాయ‌కుల మ‌ధ్య స‌మ‌న్వ‌యం సాధించ‌డం స‌మ‌స్య‌గానే మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.