ఫ్యామిలీ వెకేష‌న్‌లో ఎన్టీఆర్‌… కొర‌టాల ఇచ్చిన షాక్ ఇదే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. త్రిబుల్ ఆర్‌ లాంటి భారీ పాన్ ఇండియా హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాపై పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

మరోసారి వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో కచ్చితంగా దేవర సెన్సేషనల్ క్రియేట్ చేస్తుందన్న అంచనాలు సినీ అభిమానులతో పాటు, ట్రేడ్ వర్గాల్లోనూ ఉన్నాయి. కేవలం నందమూరి అభిమానులే కాదు.. నార్మల్ ఆడియన్స్ లోనూ దేవరపై మంచి అంచనాలు ఉన్నాయి. కొరటాల సన్నిహితుడు మిక్కిలినేని సుధాకర్ – ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్‌రామ్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు.

అనిరుధ్‌ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కడ బ్రేకుల్లేకుండా శరవేగంగా జరుగుతోంది. ఇక తాజాగా ఎన్టీఆర్ తన ఫ్యామిలీ వెకేషన్ లో ఉన్నాడు.. అయినా కూడా కొరటాల మిగిలిన ఆర్టిస్టులపై షూటింగ్‌ కంటిన్యూ చేస్తున్నాడట. ఎన్టీఆర్ లేకపోయినా తాను షూటింగ్ మాత్రం ఆపన‌ని కొరటాల ఇప్పటికే కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుగా ప్రకటించినట్టుగానే వచ్చే యేడాది ఏప్రిల్ 5న దేవర సినిమాను థియేటర్లలో నిలపాలి అనేది మేకర్స్ పక్కా ప్లాన్ అట. ఇక సినిమాలో విజువల్స్ తో పాటు సీజీ వర్క్‌కు ఎక్కువగా ప్రాధాన్యం ఉండడంతో ఆ పార్ట్‌ కూడా షూటింగ్ తో పాటు సమానంగా కంప్లీట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.