ఢిల్లీలో నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో మరణశిక్ష విధించిన నలుగురిలో ఒకడైన వినయ్ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. తన ఉరి శిక్షను… యావజ్జీవ శిక్షగా మార్చాలని వినయ్ శర్మ విజ్ఞప్తి చేయగా, దాన్ని రాష్ట్రపతి తిరస్కరించడంతో ఆ కేసులో నలుగురు దోషులకూ ఉరిశిక్ష అమలు చేసేందుకు వీలు కలగనుంది.
ఢిల్లీలోని కదులుతున్న బస్సులో పారామెడిక్ స్టూడెంట్ నిర్భయపై 2012లో దోషులు ముకేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్‌కుమార్ సింగ్ (31) సామూహికంగా అత్యాచారం జరిపారు. మర్మాంగాల్లో ఇనపు చువ్వలతో చిత్ర హింసలు పట్టారు. ఫలితంగా ఆమె మరణానికి కారణమయ్యారు. అదేవిధంగా నిర్భయ స్నేహితుణ్ని కూడా తీవ్రంగా గాయపరిచారు. ఈ కేసులో నేరం నిరూపణ కావడంతో ఆ నలుగురికి ఉరి ఉరిశిక్షను విధిస్తూ ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు తీర్పు నిచ్చిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా ఆ ఉరిశిక్ష అమలును అడ్డుకునేందుకు దోషులు మొదటి నుంచి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే దోషుల్లో ఒకడైన అక్షయ్‌కుమార్ ఈ ఉరిశిక్షను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశాడు. దానిని కొట్టివేయడంతో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇలా ఎన్ని నాటకాలాడినా ఫిబ్రవరి 1న నలుగురికీ ఉరిశిక్ష అమలు చెయ్యాలని మరోసారి డెత్ వారెంట్లు జారీ అయ్యాయి. తీరా శిక్ష అమలవుతుందనే చివరి నిమిషంలో దోషుల్లో మళ్లీ ఒకరు మెలిక పెట్టారు. దోషుల్లో ఒకడైన వినయ్‌శర్మ రాష్ర్టపతికి క్షమాభిక్ష అర్జీని పెట్టుకున్నాడు. అది పెండింగ్‌లో ఉన్నందున ఉరిశిక్షను వాయిదా వేయాలన్న దోషుల వాదనను సమర్థిస్తూ ఉరిశిక్ష అమలుపై మరోసారి స్టే విధించింది కోర్టు. ప్రస్తుతం దోషి వినయ్‌శర్మ దరఖాస్తును రాష్ర్టపతి తిరస్కరించడంతో ఉరిశిక్ష అమలుకు మార్గాలు ఏర్పడ్డాయి. అయితే ఉరి అమలు తేదీ ఏదనేది ఇంకా స్పష్టం కాలేదు. ఉరిశిక్ష అమలులో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ నిర్భయ తల్లి ఆశాదేవి కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రభుత్వం, కోర్టులు కావాలనే దోషులను కాపాడుతున్నాయని కంటతడి పెట్టారు.