కాంగ్రెస్‌లో ‘మర్రి’ మంటలు..పీసీసీ చీఫ్‌, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌పై ఫైర్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. రేవంత్ వ్యవహారం పట్ల కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు చాలా మంది అసంతృప్తితో ఉన్నారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని బయటపెట్టారు. రాజగోపాల్ రెడ్డి, దాసోజు శ్రవణ్ పార్టీని వీడారు కూడా. రేవంత్ రెడ్డి ఏకపక్షంగా ముందుకు వెళ్తున్నారని.. జగ్గారెడ్డి లాంటి నేతలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. తాజాగా ఆ లిస్టులోకి మరో నేత వచ్చారు.

కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘మాణిక్కం ఠాగూర్, రేవంత్ రెడ్డి వ్యవహారశైలితో కాంగ్రెస్ పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతోంది. అసలు రేవంత్ మాణిక్కం కింద పనిచేస్తున్నారో.. మాణిక్కం ఠాగూరే రేవంత్ కింద పనిచేస్తున్నారో తెలియడం లేదు. హైకమాండ్ కు తప్పుడు నివేదికలు సమర్పిస్తున్నారు. ఇష్టారాజ్యంగా పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. జానారెడ్డి నేతృత్వంలో ఓ కమిటీని వేసినప్పటికీ ఆ కమిటీ నామమాత్రంగా ఉంది. ఏ ఉపయోగం లేదు.

ఇది పార్టీకి ఎంతో నష్టం చేకూరుస్తుంది. నిజమైన కార్యకర్తలు, పార్టీకోసం పనిచేసేవారు ఎంతో నష్టపోతున్నారు. సీనియర్ కాంగ్రెస్ నేతలను పట్టుకొని హోంగార్డులని అభివర్ణించడం ఎంతవరకు సబబు’ అంటూ ఆయన ప్రశ్నించారు. మరోవైపు ఈ ఆరోపణలకు మాణిక్కం ఠాగూర్ కూడా దీటుగా బదులిచ్చారు. తాను ఎవరికీ ఏజెంట్ ను కాదని.. సోనియాగాంధీకి మాత్రమే ఏజెంట్‌నని పేర్కొన్నారు. మొత్తంగా మర్రి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో మంటలు పుట్టిస్తున్నాయి. త్వరలో మరికొందరు నేతలు కూడా ఆ పార్టీని వీడబోతున్నారని సమాచారం. ఈ పరిణామాలను కాంగ్రెస్ పార్టీ ఎలా తీసుకుంటుందో వేచి చూడాలి.

Tags: Manickem Tagore, Marri Shashidhar Reddy, Telangana Congress, TPCC RevanthReddey